
చికిత్సపొందుతున్న వెంకట రామారావు
చీరాల రూరల్: ఓ మహిళ కిడ్నాప్ కేసులోని నిందితుడు పోలీసులు కొడతారన్న భయంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్ద జరిగింది. ఒన్‌టౌన్ సీఐ వి.సూర్యనారాయణ కథనం ప్రకారం.. వైకుంఠపురానికి చెందిన పి.వెంకట రామారావు అనే వివాహితుడు నెల రోజుల క్రితం ఓ మహిళను తనతో పాటు తీసుకెళ్లాడు.
మహిళ తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకట రామారావుతో పాటు ఆ మహిళను గాలించి పట్టుకున్నారు. ఫిర్యాదు చేసిన వారు నిందితుడితో రాజీ పడటంతో పోలీసులు అందరినీ ఇంటికి పంపించి కోర్టులో రాజీ చేసుకోవాలని సూచించారు. వెంకట రామారావు మళ్లీ రాత్రి సమయంలో ఆ మహిళ ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు మళ్లీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితుడితో పాటు కేసు రాజీ చేసిన కొందరు పెద్దలను కూడా స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఓ కేసు పెండింగ్‌లో ఉంది, మళ్లీ మరో కేసు పెట్టినందున పోలీసులు తీవ్రంగా కొడతారని భయపడిన వెంకట రామారావు తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి నోటి నుంచి నురగ రావడం గమనించిన పోలీసులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పురుగుమందు పోలీసుస్టేషన్‌లోనే తాగినట్లు సమాచారం.