బుకీ జతిన్
కర్ణాటక, బనశంకరి: సంచలనాల కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, నటీమణుల ప్రమేయం తదితరాల కేసు విచారణను తీవ్రతరం చేసిన బెంగళూరు సీసీబీ అంతర్జాతీయ బుకీ జతిన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది. కొన్నినెలలుగా నెదర్లాండ్స్‌లో తలదాచుకున్న ఢిల్లీకి చెందిన ఇతని కోసం రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీచేశారు. అంతలోగా జతిన్ కోర్టులో ముందస్తు జామీను తీసుకున్నాడు. కేపీఎల్ ఫిక్సింగ్‌లో సూత్రధారిగా పేరున్న జతిన్ కెంపేగౌడ విమానాశ్రయానికి వస్తున్నాడనే పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం కెంపేగౌడ విమానాశ్రయంలో నెదర్లాండ్స్ నుంచి విమానంలో దిగగానే సీసీబీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సీసీబీ ఉన్నతాధికారి సందీప్ పాటిల్ తెలిపారు. జతిన్ కేపీఎల్‌తో పాటు పలు క్రికెట్ మ్యాచ్ బెట్టింగుల్లో పాల్పంచుకున్నట్లు తేలిందని, దీనిపై కూపీ లాగుతున్నట్లు చెప్పారు.
కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి జతిన్ కీలక సమాచారం అందించాడని, ఇప్పటి వరకు అరెస్టైన వారితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. డీసీపీ కుల్‌దీప్‌కుమార్ జైన్ నేతృత్వంలో జతిన్‌ను విచారిస్తున్నామని, కోర్టు అనుమతి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేపీఎల్ బాగోతం కీలక మలుపు తిరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment