కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని జిల్లా పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకుని మూడు గంటలపాటు విచారించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన చువ్వా గోపాల్‌రెడ్డి దగ్గర ఓర్వకల్లుకు చెందిన నాగన్న డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా చూపించి కర్నూలు రవాణా శాఖ కార్యాలయంలో నాగన్న పేరు మీద మూడు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత వాటిని ప్రభాకర్‌రెడ్డి కూతురు పేరు మీద మార్పు చేయించుకున్నారు. దీనిపై కర్నూలు డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 9వ తేదీన ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. కడప నుంచి కర్నూలుకు తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కర్నూలు ఇన్‌చార్జ్ డీఎస్పీ వెంకట్రామయ్య, తాలూకా సీఐ శ్రీనాథరెడ్డి, ఓర్వకల్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు తదితరులు విచారణ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న బోయ రవికుమార్, అంబటి నాగేశ్వర్‌రెడ్డి, జింకా నాగేంద్ర, ముత్తుకుమార్ తదితరులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. విచారణ అనంతరం ప్రభాకర్‌రెడ్డిని తిరిగి కడప జిల్లా జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment