రోదిస్తున్న మృతుడి భార్య, తండ్రి, (ఇన్‌సెట్లో) గొల్ల పెద్ద రాజు (ఫైల్)
అమరచింత (కొత్తకోట): ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కొంకన్‌వానిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొంకన్‌వానిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చంద్రన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్ద రాజు, చిన్నకుమారుడు చిన్న రాజు కలిసి వ్యవసాయ పనులతో పాటు గొర్ల మందను మేపేవారు. ఉమ్మడి కుటుంబంలో 200 పైచిలుకు గొర్రెల మందను పోషిస్తున్న ఇరువురు ఓ కాపరీని జీతానికి నియమించుకున్నారు. నెలసరి వేతనాలను చెల్లిస్తూ గొర్లను కాపాడుతూ వ్యవసాయ పనులను సాఫీగా కొనసాగిస్తూ వచ్చారు. గత రెండు నెలల క్రితం ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందను అన్నదమ్ములు ఇరువురు సమానంగా పంచుకున్నారు. దీంతో గొర్రెల కాపరికి చెల్లించా ల్సిన వేతనాన్ని అన్న ఇవ్వలేదని చిన్న రాజు తరచూ గొడవ పడేవాడు.
హత్యకు దారితీసిన రూ.10వేలు
ఇదిలాఉండగా, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తికి గొల్ల పెద్దరాజు ద్వారా రూ.10వేలు చెల్లించాల్సి ఉందని తమ్ముడు చిన్నరాజు తరచూ డబ్బుల విషయంలో తగువులాడేవాడు. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న గొర్రెల మందలో ఎన్నో గొర్రెపిల్లలను అమ్ముకున్నావని అన్న చెప్పిన మాటలకు జీర్ణించుకోలేని చిన్నరాజు అన్నపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం నుంచి తిరిగివచ్చిన పెద్దరాజు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడే ఇంటికి వచ్చిన చిన్నరాజు ఇంట్లోకి వెళ్లి నిద్రమత్తులో ఉన్న గొల్ల పెద్దరాజు తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు.
దీంతో తల పగిలి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చిన్నరాజు ‘నా అన్నను చంపేశా..’ అంటూ అరుస్తూ పరారైనట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మకూర్ సీఐ బండారి శంకర్, అమరచింత ఎస్‌ఐ రామస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులు, కుటుంబసభ్యుల ద్వారా వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గొల్ల పెద్దరాజుకు భార్య మంజులతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment