
నిందితురాలు రాజ్యలక్ష్మి
చందానగర్: ఏడాదిన్నర పసిపాపను హత్య చేసి నీటి తొట్టిలో వేసిన నిందితురాలికి ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే చందానగర్ వేమన వీకర్ సెక్షన్‌లో నివాసముండే బాల్‌రాజ్ రేణుక దంపతులకు ఏడాదిన్నర కూతురు జ్యోతిష ఉండేది. వారి ఇంటి పక్కనే రేణుక ఆడపడుచు రాజ్యలక్ష్మి (24) నివాసముంది. రాజ్యలక్ష్మికి 8 నెలల గర్భం ఉండగానే పాపపుట్టి చనిపోయింది. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న జ్యోతిషను చూసి ఆమె ఈర్శను పెంచుకుంది. పథకం ప్రకారం 30 జూన్ 2015న మధ్యాహ్నం 12 గంటల సమయంలో జ్యోతిష తల్లి రేణుక స్నానం చేయడానికి బాత్ రూమ్‌కు వెళ్లింది.
ఆ సమయంలో చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉండడం చూసిన రాజ్యలక్ష్మి చిన్నారిని హత్య చేసి నీటి తొట్టిలో పడేసింది. తల్లి రేణుక స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి చిన్నారి నీటి తొట్టిలో శవమై కనిపించింది. దీంతో రేణుక రాజ్యలక్ష్మిపై అనుమానంతో చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు సాక్ష్యదారాలను కోర్టును సమర్పించారు. దీంతో ఎల్బీనగర్ కోర్టు శుక్రవారం నిందితురాలు రాజ్యలక్ష్మికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.