విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
విజయనగరం ఫోర్ట్/ దత్తిరాజేరు/విజయనగరం టైన్ / బొండపల్లి: విజయనగరం పట్టణంలోని పనులు ముగించుకుని గమ్య స్థానాలకు చేరడం కోసం వారంతా ఆర్టీసీ తెలుగువెలుగు బస్సు ఎక్కారు. గంట, గంటన్నర సమయానికి ఇళ్లకు చేరుకుంటామని భావించారు. ఇంతలోనే లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. కళ్లు తెరిచి చూసే సరికి బస్సులో ఆర్తనాదాలతో అలజడి. కాళ్లు విరిగిపోయిన వారు కొందరైతే, చేతులు, వెన్నుపూస, తలకు గాయాలైన వారు మరికొందు. ఇలా 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి బొండపల్లి మండలం గొట్లాం గ్రామం వద్ద 26వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. బొండపల్లి ఎస్‌ఐ వర్మ, స్థానికులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయనగరం ఆర్టీసీ కాంపెక్సు నుంచి ప్రయాణికులతో సాలురు వెళ్తున్న తెలుగువెలుగు బస్సు 26వ జాతీయ రహదారిపై గొట్లాం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రత్నగిరి ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ ఎడమవైపు నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని స్థానికులు నాలుగు 108 అంబులెన్సులలో విజయనగరం జిల్లా కేంద్రాస్సత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది క్షతగాత్రులకు చికిత్స అందించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖ పట్నం కెజిహెచ్‌కు తరలించారు.
బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు...
బస్సును లారీ ఢీకొన్న సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఆర్. ప్రకాష్‌రావు, బి.వెంకటరావు, బి.సింహాచలం, ఎ. కృష్ణారావు, ఎన్.ఎర్రిబాబు, ఆర్.త్రినాథ్, పి.ప్రకాష్, కె.పద్మావతి, ఎం.రాజేష్, ఎస్.శివుడు, ఐ. దివాకర్‌రావు, ఎస్.చిన్నమ్మలు, కె.జయశ్రీ, ఎ.రామకృష్ణ, పి.చంద్రశేఖర్, ఎం.నాగేశ్వరరావు, సీహెచ్ ఈశ్వరరావు, కె.సురేష్, టి.దివాకర్, సీహెచ్ సత్యారావు, ఎం.రాజేశ్వరరావు, యు.అప్పలరాజులు ఉన్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరావు, చంద్రశేఖర్, ఎస్.చిన్నమ్మలు, శివుడులను కేజీహెచ్‌కు తరలించారు. చిన్నమ్మలు, శివుడులు భార్యభర్తలు. ప్రమాద సమాచారం అందుకున్న క్షతగాత్రుల బంధువులు జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment