జన్నారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వరూప
ప్రేమించామని ఊసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకుం టామని నమ్మబలుకుతున్నారు. సినిమాలకు షికార్లకు తీసుకెళ్తున్నారు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగితే మాత్రం ప్లేట్ ఫిరాయిస్తున్నారు. దండేపల్లి ఘటనకు శుభం కార్డు పడకముందే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రేమించిన వాడి ఇంటి ఎదుట మౌన పోరాటాలు చేస్తున్నారు యువతులు. మంగళవారం జన్నారం మండలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించగా భర్త దూషించడంతో ఆత్మహత్యకు యత్నించింది. కెరమెరిలో యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైటాయించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం అనార్‌పల్లిలో మంగళవారం గోలేటికి చెందిన గుగులోతు కళ్యాణి పెళ్లి చేసుకోవాలని పోరాటం చేసింది. కళ్యాణి అనార్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీదాస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను కాదని మరో అమ్మాయితో శ్రీదాస్ వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న కళ్యాణి ఆమె కుటుంబీకులతో కలిసి మంగళవారం అనార్‌పల్లికి చేరుకుంది. మధ్యలో ఉన్న ఆశ్రమ పాఠశాల సమీపంలో ఇరు వర్గాల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. కళ్యాణి, శ్రీదాస్ బంధువులు వాదులాడుకున్నారు. దీంతో కెరమెరి పోలీసుల వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం కళ్యాణి రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను శ్రీదాస్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నామని తన చెళ్లి పెళ్లి అయ్యాక పెళ్లి చేసుకుందామని శ్రీదాస్ నమ్మబలికాడని, తనను శారీరకంగా వాడుకున్నాక ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. సీఐ శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ విషయం తెలుసుకుని ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ జరిపిస్తామని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నం చేశారు. న్యాయం జరగకుంటే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేస్తానని కళ్యాణి తనతో తీసుకవచ్చిన పురుగుల మందు డబ్బాను ముందు పెట్టింది. డీఎస్పీ వదక్దు సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని, శ్రీదాస్‌ను కూడా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని సీఐ, ఎస్సై చెప్పడంతో కళ్యాణి ఆందోళన విరమించింది. కళ్యాణికి ఉమ్మడి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు బియ్యాల పద్మ, నాయకురాళ్లు కాజల్ బిస్వాస్, పద్మా, తారా మద్దతు పలికారు.
కళ్యాణితో ఎలాంటి సంబంధం లేదు
కళ్యాణితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నాకు బంధువు మాత్రమే. నేనెప్పుడూ ఆమెను ప్రేమించలేదు. 2015 లో ఉద్యోగం వచ్చిందని అప్పటి నుంచి నన్ను వేదనకు గురిచేస్తోంది. కళ్యాణి నాపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. నేను హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వులు వచ్చాకే వివాహం చేసుకుంటున్నాను. – శ్రీదాస్
జన్నారం(ఖానాపూర్): జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన జాదవ్ బద్రేశ్వర్, పొన్కల్‌కు చెందిన బాదవత్ స్వరూప పెద్దలనెదిరించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో చదువుతుండగా వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి 2018 మార్చిలో గూడెంలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్ని గొడవలు జరగడంతో పది రోజుల క్రితం స్వరూప భర్త ఇంటి ఎదుట నిరసన తెలిపింది. చివరకు కలిసి ఉంటామని పోలీసుల ఎదుట కాగితం రాసుకున్నారు.
వారం క్రితం హైదరాబాద్ వెళ్లారు. చిన్న చిన్న మనస్పర్ధలతో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరూ జన్నారంకు వచ్చారు. నేను వస్తాను నువ్వు మీ ఇంటికి వెళ్లు అని బద్రేశ్వర్ ఎటో వెళ్లిపోయాడు. స్వరూప ఇంటికి వెళ్లడంతో ఆమె తల్లి అనసూయ ఇంటికి రానివ్వలేదు. దీంతో తిరిగి పొన్కల్‌లోని గాంధీనగర్‌కు వెళ్లే దారిలోని భర్త ఇంటి ఎదుట కూర్చుని ఫోన్ చేయడంతో విసిగించకు, టార్చర్ పెట్టకు అని భర్త అనడంతో స్వరూప సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తల్లి అనసూయ, బంధువులు స్వరూపను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై తహసీనోద్దీన్ పరిస్థితిని సమీక్షించారు.
ప్రేమించి మోసం చేసిన ప్రియుడి అరెస్ట్
సారంగపూర్(నిర్మల్): సారంగాపూర్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ కరుణ తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. అయితే బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఈ ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శేక్ బాబ(30)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సునిల్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment