రాజు కోసం ఏలూరు కృష్ణకాలువలో గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
‘‘పెద్దగా చదువుకోలేదు.. కానీ చేతిపని ఉన్నోడు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో సీలింగ్ పని చేస్తుంటాడు... హైదరాబాద్‌లో ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమికురాలి కోసమని పనిమానేశాడు. కాంట్రాక్టు పనుల కోసం పెట్టుబడి పెట్టాలని ఇంట్లో చెప్పి తండ్రితో అప్పులు చేయించి మరీ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకువెళ్లేవాడు.
వేలకు వేలు డబ్బులు ప్రియురాలికి సమర్పించుకుంటూ ఉండేవాడు. చివరికి నీపై ప్రేమేలేదని ఆ యువతి చెప్పింది... తాను నిజాయితీగా ప్రేమిస్తే ఆమె మోసం చేసిందని వేదనతో కుమిలి పోయాడు.. ఆమె లేకపోతే బతికి ఉండడమే వేస్ట్ అనుకున్నాడు. స్నేహితులు ఎంత నచ్చజెప్పినా వినకుండా కాలువలోకి దూకి ప్రాణం తీసున్నాడు’’
ఏలూరు టౌన్ : ఏలూరు హనుమాన్‌నగర్ కృష్ణా కాలువలో ఒక యువకుడు దూకాడనే సమాచారం మంగళవారం ఏలూరు పట్టణంలో కలకలం రేపింది. స్నేహితుడు చూస్తుండగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువలోకి దూకేయటంతో అతడు హతా శుడయ్యాడు.తేరుకుని వెళ్లి స్నేహితుడిని కాపాడేందుకు కాలువలోకి దూకాడు. కానీ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి వెనక్కి వచ్చేశాడు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.35 నిమిషాల వరకూ కృష్ణకాలువలో అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తీవ్రస్థాయిలో గాలించారు. బోటు, లైఫ్ జాకెట్లు వేసుకుని సిబ్బంది కాలువలో జల్లెడపట్టారు. జిల్లా అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి యాగంటి హనుమంతరావు కుమారుడు శివతేజ కాలికి మృతదేహం తగలటంతో మిగిలిన సిబ్బంది కాలువలో దూకి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రేమ కాటేసింది :
ఏలూరు దొండపాడుకు చెందిన జొన్నాదుల రాజు (28) పదో తరగతి వరకూ చదువుకున్నాడు. తండ్రి కృష్ణ తాపీపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రాజు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వర్కు చేస్తుంటాడు. గత కొంతకాలంగా కాంట్రాక్టు వర్కులు ఒప్పుకుని ఊర్లు తిరుగుతూ పనులు చేస్తుండేవాడు. ఇటీవల రాజుకు ఒక యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారటంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉండే యువతి కోసమే వేలాది రూపాయలు అప్పులు చేస్తుండేవాడని స్నేహితులు చెబుతున్నారు.
ఇంట్లో వారితో కూడా కాంట్రాక్టు పనుల కోసమని చెప్పి అప్పులు చేయించి మరీ తీసుకువెళ్లి యువతికి ఖర్చు చేసేవాడని అంటున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసిమరీ ప్రేమగా చూసుకుంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ యువతిని తీసుకువచ్చి తనతో పెళ్లి చేయకపోతే రైలుకింద పడి చనిపోతానని ఇంట్లో వాళ్లని రెండు రోజుల క్రితం బెదిరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం బలవంతంగా హైదరాబాదు నుంచి తీసుకువచ్చారు.
హనుమాన్ నగర్‌లో సంఘటనా స్థలానికి ఎదురుగా నివాసం ఉంటున్న స్నేహితుడు యార్లగడ్డ రమేష్ వద్ద ఉంటున్నాడు. ఉదయం నుంచి పూటుగా మద్యం సేవిస్తున్న రాజు మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పరుగెత్తుకుంటూ వెళ్లి కృష్ణా కాలువలోకి దూకేశాడు. రక్షించేందుకు కాలువలోకి దూకిన అతని స్నేహితుడు రమేష్ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రెండున్నర గంటలు శ్రమించి రాజు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment