![Love Matter Harassments On Degree Girl Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/16/60.jpg.webp?itok=r2-reqT9)
దాడిలో గాయపడిన చంద్రశేఖర్, మంజు గాయపడిన యువతి తల్లి
గంగవరం: ఓ ప్రేమోన్మాది మళ్లీ రెచ్చిపోయాడు. ఈ పర్యాయం యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్యపై తన అనుచరులతో దాడి చేశాడు. కర్రలతో కొట్టి, చితకబాదడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైనా తిరగబడ్డాడు. తనను ప్రేమించకపోతే అంతుచూస్తానంటూ యువతిని తీవ్రంగా హెచ్చరించాడు. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని మార్జేపల్లెలో చోటుచేసుకుంది. బాధితులు కథనం..డిగ్రీ సెకండియర్ చదువుతున్న గ్రామానికి చెందిన ఓ యువతిని జులాయిగా తిరిగే చరణ్‌రాజ్ (25) ఏడాది కాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆరు నెలల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆ సమయంలో అతనిపై చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టు నుంచి చరణ్‌రాజ్ యాంటిసిపేటరీ బెయిల్ పొంది దర్జాగా తిరగసాగాడు. అంతేకాకుండా ఆ యువతిని మరింత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఆ యువతికి తోడుకు బస్ స్టాప్ వరకు ఆమె సోదరుడు చంద్రశేఖర్ వచ్చాడు. ఇది చూసిన చరణ్‌రాజ్ ..తోడుగా వస్తే భయపడతాననుకున్నావా? అంటూ అతడిని దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. దీంతో చంద్రశేఖర్ తన తల్లిదండ్రులు, మామయ్యకు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని చరణ్‌రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను వేధించడం మానుకోవాలని హితవు పలికారు.
దీంతో ఆగ్రహించి చరణ్‌రాజ్ ఫోన్‌లో తన అనుచరులు సుబ్బరామయ్య, విశ్వేశ్వరయ్య, జగదీష్, అశోక్, యువరాజు, వెంకటరమణ, అక్కడికి రప్పించి కర్రలతో యువతి తల్లిదండ్రులు, సోదరుడు, మామయ్య మంజుపై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు కొందరు వారిని అడ్డుకుని చరణ్‌రాజ్ అతని అనుచరులను మందలించారు. వారిపై కూడా చిందులేసిన చరణ్‌రాజ్ అంతు చూస్తానంటూ యువతి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వెళ్లిపోయాడు. దాడి ఘటనలో గాయపడిన యువతి తల్లిదండ్రులు, అన్న, మామయ్యను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం యువతి తల్లిదండ్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై సెక్షన్ 354, సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment