
లాడ్జీలో విష్ణువర్ధన్, మౌనిక మృతదేహాలు (ఇన్ సెట్‌లో) సూసైడ్ నోట్
సాక్షి, వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన వివాహిత రాచర్ల మౌనిక(26), బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సింగతి విష్ణువర్ధన్( 26) క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం బద్ది పోచమ్మ వీధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన మౌనిక, బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన విష్ణువర్ధన్ కలిసి శనివారం వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చారు. బద్దిపోచమ్మ వీధిలో ఉన్న ఓప్రైవేట్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. ఒకరోజు కోసం రూమ్ తీసుకున్న ఇద్దరు మరుసటిరోజు ఆదివారం అద్దెను పొడగించుకుని ఆ రూమ్‌లోనే గడిపారు. సోమవారం రూం ఖాళీ చేయాలని లాడ్జీ నిర్వాహకులు ఆదేశించారు. మంగళవారం మొక్కులు చెల్లించుకునేది ఉందని చెప్పి మళ్లీ అద్దె పొడగించుకున్నారు.
మంగళవారం రూమ్ ఖాళీ చేయించడానికి లాడ్జీ నిర్వాహకులు రూమ్ వద్దకు వెళ్లి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. అనుమానం వచ్చి లాడ్జీ సిబ్బంది కిటికీలోంచి చూడగా విష్ణు, మౌనిక మంచంపై విగత జీవులుగా కనిపించారు. ఇద్దరి నోట్లో నుంచి నురగులు వచ్చినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి తీసుకుని గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతుల అడ్రస్ గుర్తించి బంధువులకు సమాచారం అందించారు.
వివాహేతర సంబంధం..!
విష్ణువర్ధన్, మౌనిక కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా మౌనికకు కరీంనగర్ జిల్లా ఓదెల గ్రామానికి చెందిన రాచర్ల అశోక్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కూతురు అమతవర్షిణీ, నాలుగేళ్ల కుమారుడు ఆర్యన్ ఉన్నారు. మూడేళ్ల క్రితం మౌనికను ఆమె తండ్రి గుండారపు కృష్ణ మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి తీసుకొచ్చాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌనిక ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తృతీయ సంవత్సరం చదువుతోంది.
అయితే మౌనిక వివాహం చేసుకున్నా చిన్ననాటి స్నేహితుడు లింగాపూర్ గ్రామానికి చెందిన విష్ణుతో ప్రేమాయణం కొనసాగించింది. ఆ విషయాన్ని మృతులు సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మౌనిక వివాహేతర బంధం సాగించడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయం తెలిసి గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తున్న క్రమంలో ప్రతిరోజు మౌనిక స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రాక్టీకల్స్ చేయడానికి కాలేజీ నుంచి విష్ణు ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడినట్లు సమాచారం.
కలిసి జీవించలేక..
విష్ణువర్ధన్, మౌనికల మధ్య ప్రేమ బంధం బలపడినా కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమెకు పెళ్లి కావడం, ఇద్దరు పిల్లలు ఉండడం ఓ కారణమైతే, ఇద్దరి కులాలూ వేరు కావడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితులు ఎదుర్కొన్నారు. భర్త నుంచి ఆమెకు విడాకులు ఇప్పించినా తన సామాజికవర్గం అంగీకరించదని విష్ణు ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే వేములవాడకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
సూసైడ్ నోట్.. ప్రేమ వ్యవహారం
ప్రైవేట్ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్, మౌనిక పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నామని, ఈ క్రమంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఆ ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సీఐ వెంకటస్వామి తెలిపారు. వివాహేతర బంధం చివరికి ఆ ఇద్దరినీ బలితీసుకోగా.. మౌనిక పిల్లలు తల్లిలేనివారయ్యారు.
తరలివచ్చిన కుటుంబ సభ్యులు..
వేములవాడలో ఇద్దరు ప్రేమికులు చనిపోయిన ఘటన తెలియగానే బెల్లంపల్లి నుంచి మౌనిక ,విష్ణు కుటుంబీకులు హుటాహుటీన వచ్చారు. లాడ్జీలో విగత జీవులుగా పడిఉన్న ఇద్దరినీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టమార్టం చేయించారు. అనంతరం బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment