వివాహేతర దారుణాలకు కారణాలేంటి? | Madras High court asks government whether TV shows, movies are responsible for extramarital affairs | Sakshi
Sakshi News home page

వివాహేతర దారుణాలకు కారణాలేంటి?

Published Fri, Mar 8 2019 8:23 AM | Last Updated on Fri, Mar 8 2019 8:28 AM

Madras High court asks government whether TV shows, movies are responsible for extramarital affairs - Sakshi

దేశంలో వివాహేతర సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు పెరిగిపోవడానికి వివిధ టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్న సీరియళ్లే ప్రధాన కారణమా. అంతేకాదు వీటిపై మాకు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో వివాహేతర సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు పెరిగిపోవడానికి వివిధ టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్న సీరియళ్లే ప్రధాన కారణమా. అంతేకాదు వీటిపై మాకు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...తిరువళ్లూరు జిల్లా వేపంబట్టైకి చెందిన అజిత్‌కుమార్‌ తనను గూండా చట్టం కింద జైల్లో పెట్టేందుకు చెన్నై పోలీసు కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ మద్రాసు హైకోర్టు అడ్వకొనర్వు పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు ఎన్‌ కృపాకరన్, అబ్దుల్‌ఖుద్దూస్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై కొరటూరుకు చెందిన ఒక యువతితో జోసెఫ్‌ అలియాస్‌ రంజిత్‌కుమార్‌ అనే వ్యక్తికి వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ యువతి రంజిత్‌కుమార్‌ స్నేహితుడైన లోకేశ్‌తో సైతం వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. దీంతో లోకేశ్‌పై రంజిత్‌కుమార్‌ దాడిచేశాడు. ఆ తరువాత అన్నై సత్యానగర్‌కు చెందిన మరో యువతితో కూడా రంజిత్‌కుమార్‌ వివాహేతర సంబంధాన్ని నెరిపాడు. తనపై దాడిచేసిన రంజిత్‌కుమార్‌ను హతమార్చడానికి అవకాశం కోసం లోకేష్‌ కాచుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రౌడీ నిరోధక విభాగానికి చెందిన సతీష్‌ అనే పోలీసు రంజిత్‌కుమార్‌ను న్యూ ఆవడి రోడ్డులో విచారణ జరుపుతున్నాడు. ఆ సమయంలో ఐదుగురితో అక్కడికి చేరుకున్న లోకేష్‌.. రంజిత్‌కుమార్‌పై వేటకొడవళ్లతో దాడిచేసి హతమార్చాడు. ఈ కేసులో లోకేష్‌తోపాటు అరెస్టయిన అజిత్‌కుమార్‌ తనను గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. 

వివాహేతర సంబంధాల కారణంగా కిడ్నాప్‌లు, దారుణమైన హత్యలు, తీవ్రమైన దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, ఇలాంటి ద్రోహానికి పాల్పడే భర్తను భార్య, భార్యను భర్త కడతేర్చడం చెన్నైలో పెరిగిపోయిందని పేర్కొంటూ సవివరాలతో కూడిన కథనాన్ని టీటీ నెక్ట్స్‌ అనే ఆంగ్లపత్రిక 2016లో ఒక కథనాన్ని ప్రచురించింది. 2014 జరిగిన 141 హత్యల్లో 90, 2015–16లో చోటుచేసుకున్న 129 హత్యల్లో 91 హత్యలు, 2016 జూలై వరకు జరిగిన 65 హత్యల్లో 50 హత్యలు వివాహేతర సంబంధాల కారణంగానే జరిగాయని ఆ కథనంలో పేర్కొన్నారు. 2014లో మరో ఆంగ్లపత్రిక విడుదల చేసిన వివరాల్లో సమైక్యాంధ్ర రాష్ట్రంలో వివాహేతర సంబంధాల హత్యలు ఎక్కువగా జరిగాయని స్పష్టం చేశారు. 2013లో వివాహేతర సంబంధాల కారణంగా 385 హత్యలు జరిగినట్లు ఆందులో పేర్కొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతల్లో అత్యంత భీతికొలిపే వివాహేతర సంబంధాలకు ప్రధాన కారణం ఏమిటనే ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. వివాహేతర సంబంధాల కారణంగా గత పదేళ్లలో తమిళనాడులో, దేశంలోనూ ఎన్ని హత్యలు జరిగాయి. 

వివాహేతర సంబంధాల కారణంగా ఇతర నేరాలు పెరిగిపోతున్నాయా. ఇందుకు టీవీ సీరియళ్లు, సినిమాలు దోహదం చేస్తున్నాయా. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, దొంగతనాలు, కిడ్నాప్‌లకు పాల్పడేవిధంగా టీవీ సీరియళ్లు, సినిమాలు రెచ్చగొడుతున్నాయా. జీవిత భాగస్వామిని హతమార్చేందుకు కిరాయి మూకలకు డబ్బు చెల్లిస్తున్నారా. వివాహేతర సంబంధాలు పెరిగిపోవడానికి యువతీ, యువకులు ఇద్దరూ సంపాదిస్తూ ఆర్థిక స్వతంత్య్రం కలిగి ఉండడం కారణమా. జీవత భాగస్వామితో సంతృప్తికరమైన లైంగిక సంబంధాలు లేకపోవడమా. వివాహేతర సంబంధాల కోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక యాప్‌ ఏదైనా ఏర్పడిందా. హైటెక్‌ జీవనవిధానం, మద్యానికి బానిసైన జీవితభాగస్వామి వివాహేతర సంబంధాలకు దారితీస్తోందా. 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోవడం వల్ల వివాహేతర సంబంధాల సంఖ్య పెరిగిపోతోందా. ఇష్టంలేని వ్యక్తిని వివాహం చేసుకోవడం కారణమా.  ఇలాంటి విపరీత పరిస్థితులకు పూర్తిగా అడ్డుకట్టవేసేలా సశాస్త్రీయమైన విధానంలో కౌన్సెలింగ్‌ లేదా చికిత్సను అందించేలా తీర్మానించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చు కదా. దంపతుల మధ్య పరస్పర అవగాహన కల్పించే కౌన్సెలింగ్‌ సెంటర్లను ప్రారంభించవచ్చు కదా. ఈ ప్రశ్నలకు సవివరమైన సమాధానాలను ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. కేసును జూన్‌ 3వ వారానికి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement