పసిపాపపై పైశాచికం | Man Attempt Molestation On Four Years Child At Jayashankar District | Sakshi
Sakshi News home page

పసిపాపపై పైశాచికం

Published Thu, Jan 2 2020 3:55 AM | Last Updated on Thu, Jan 2 2020 4:21 AM

Man Attempt Molestation On Four Years Child At Jayashankar District - Sakshi

కొమురయ్య

మహాముత్తారం: కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన వారే పసిపిల్లలను వావి వరుసలు మరిచి కాటేస్తున్నారు. వరుసకు పెద్దనాన్న అయ్యే ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సం భారతి మంగళవారం రాత్రి తన నాలుగేళ్ల కూతురితో నిద్రిస్తోంది. మధ్యరాత్రి మెలకువ రాగానే పక్కన కూతురు లేకపోవడం, తలుపులు తీసి ఉండటంతో కంగారు పడిన ఆమె.. చుట్టు పక్కల వాళ్లను లేపి వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు.

బుధవారం తెల్లవారు జామున 7 గంటల సమయంలో గ్రామ సమీప చెట్ల పొదల నుంచి ఏడుపు వినపడటంతో అటువైపు వెళ్లారు. చిన్నారి ఒంటిపై దుస్తులు లేకపోవడం.. ఒంటి నిండా గాయాలు కనిపించాయి. ఎవరు తీసుకొచ్చారని చిన్నారిని అడగ్గా పెదనాన్న అని చెప్పడంతో.. అతడి కోసం వెతుకగా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్తాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో..  
మండలంలోని కనుకునూర్‌కు చెందిన కిష్టయ్యతో భారతి వివాహం కాగా అతను చనిపోవడంతో కోనంపేటలో తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఆ సమయంలో నాగారానికి చెందిన ఓదెలుతో పరిచయం ఏర్పడింది. అతనితో సహజీవనం కొనసాగించగా ఒక కూతురు జన్మించింది. నాలుగేళ్ల కూతురితో భారతి తల్లి దగ్గర ఉంటూ కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఓదెలుకు వరుసకు సోదరుడైన కొమురయ్య తరచుగా మద్యం తాగి వచ్చి వారి ఇంట్లోనే నిద్రించేవాడు.

ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో వచ్చిన కొమురయ్య ఇంటి ముందు నిద్రించినట్లు సమాచారం. అయితే అతడే బాలికను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిందుతుడి కోసం డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా 4 బృందాలుగా గాలిస్తున్నామని డీఎస్పీ కిషన్‌ తెలిపారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం మహదేవపూర్‌ సామాజిక వైద్యశాలకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement