
మృత దేహం వద్ద రోదిస్తున్న తల్లి , ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్
ప్రకాశం, తాతిరెడ్డిపల్లి (కొమరోలు) :
మోటార్ సైకిల్‌ను వేగంగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్ ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తాతిరెడ్డిపల్లి– మలికెపల్లి రోడ్డులో మంగళవారం జరిగింది. మలికెపల్లి గ్రామానికి చెందిన ఎదురు శ్రీనివాసరెడ్డి, ఆయన బావమరిది.. గిద్దలూరు మండలం పొదలకుంటపల్లికి చెందిన వల్లగంటి సుబ్బారెడ్డి మోటార్ సైకిల్‌పై కొమరోలుకు వస్తున్నారు. మార్గమధ్యంలో తాతిరెడ్డిపల్లి సమీపంలోని మలుపువద్దకు రాగానే వేగంగా ఇటుకల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది.
ఈ సంఘటనలో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుబ్బారెడ్డికి కాలు, చేయి పూర్తిగా విరగడంతో 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. గిద్దలూరు ఎస్సై కొమరం మల్లికార్జున, ఏఎస్సై పి. ఇమాన్యూల్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరుకు తరలించారు. శ్రీనివాసరెడ్డి ఇటీవలే కువైట్ నుంచి సెలవుపై ఇంటికి వచ్చాడు. ఒక్కసారిగా కుమారుని మృతదేహం కనిపించడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు.