
టిక్‌టాక్ వీడియో తీస్తుండగా యువకుడి దుర్మరణం
ముజఫర్‌నగర్ : మాయదారి టిక్‌టాక్ నిండు ప్రాణాలను బలిగొంటోంది. టిక్‌టాక్ వీడియో కోసం స్టంట్లు చేస్తున్న కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలైన ఘటన యూపీలో వెలుగుచూసింది. ముజఫర్‌నగర్‌లో కొత్తగా పెళ్లయిన వ్యక్తి (23) వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌పై టిక్‌టాక్ కోసం స్టంట్స్ చేస్తుండగా వాహనం బోల్తాపడటంతో మరణించాడు. ముజఫర్‌నగర్‌లో పదిహేను రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటన ఇది రెండవది కావడం గమనార్హం. కొద్దిరోజుల కిందట ఓ వ్యక్తి టిక్‌టాక్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా నీటమునిగి మరణించాడు.
ఇక తాజా ఘటన వివరాలు చూస్తే..రెండు నెలల కిందట వివాహమైన కపిల్ హోలీ వేడుకల సందర్భంగా కిందిదియా గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ స్టంట్స్ పెర్‌ఫామ్ చేస్తుండగా మరో వ్యక్తి మొబైల్ ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. అయితే స్టీరింగ్‌పై పట్టుతప్పిన క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో యువకుడు మరణించాడని స్ధానికులు తెలిపారు. ట్రాక్టర్ అదుపుతప్పడంతో ముందు టైర్లకు వేలాడిన బాధితుడు వాహనం కింద పడి మరణించాడని చెప్పారు. కాగా పోలీసులకు సమాచారం అందించకుండానే కపిల్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.