
సాక్షి, హైదరాబాద్ : భార్య కాపురానికి రావడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా బావమరిది కొడుకును ఎత్తుకెళ్లాడు. 20 నెలల చిన్నారిని అపహరించి.. తన భార్యను కాపురానికి పంపిస్తేనే బాలుడిని తల్లిదండ్రులకు ఇస్తానని బెదిరింపులకు దిగాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అజీజ్ నగర్ గేట్ సమీపంలోని గోల్డెన్ ఫామ్‌లో ఉంటూ కూలి చేసుకునే యాలాల మండలానికి చెందిన కృష్ణకు, భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భాగ్యలక్ష్మికి కృష్ణ గతంలో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి తన అన్న దగ్గర ఉంటున్నారు. భాగ్యలక్ష్మికి ఆమె అన్న దగ్గర ఉండటంతో ఆగ్రహించిన కృష్ణ.. 20 నెలల అన్న కొడుకును ఎత్తుకెళ్లాడు. ‘మీ చెల్లెల్ని నాతో కాపురానికి పంపిస్తేనే.. కొడుకును ఇస్తాను’ అంటూ అతను భాగ్యలక్ష్మి అన్నకు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కృష్ణ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భాగ్యలక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment