రాయపర్తి(పాలకుర్తి):
ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్, చిన్న కుమారుడు ఉమర్). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం మైలారం రిజర్వాయర్ నిర్మాణక్రమంలో తమ్ముడు ఉమర్‌కు చెందిన మూడెకరాలు ముంపునకు గురైంది. కాగా ఉమర్ మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్నాడు. అన్న శంషోద్దీన్(35)గ్రామంలోనే ఉండి మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న రెండెకరాల భూమిని ఉమర్‌కు ఇచ్చేద్దామని తల్లిదండ్రులు శంషోద్దీన్‌తో చర్చించగా గతంలో గొడవలు జరిగాయి. చాలా ఏళ్లుగా తల్లిదండ్రులు శంషొద్దీన్ వద్దే ఉండేవారు. పదినెలలుగా తల్లిదండ్రులు ఉమర్ వద్ద ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన ఉమర్ రెండెకరాల భూమిని తన పేరుమీదకు పట్టా చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శంషొద్దీన్ అసహనంతో ఉన్నాడు. మంగళవారం రాత్రి తండ్రితో సహ ఉమర్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలు కాగా.. రోకలిబండతో ఉమర్ అన్న తలపై కొట్టాడు. దీంతో శంషొద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ పరిశీలించారు. మృతుడికి భార్య సుల్తానా, ముగ్గురు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.