
సాక్షి, చెన్నై: ఆస్తి తగాదా ఓ పారిశ్రామికవేత్త కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఉమ్మడి కుటుంబం విడిపోతోందన్న వేదనతో తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశాడు అన్న. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. మట్టకడై ప్రాంతానికి చెందిన బిల్లా జగన్ (43) కుటుంబానికి ట్రాన్స్‌పోర్టు, ఫైనాన్స్ సంస్థలు, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. డీఎంకే పార్టీకి తూత్తుకుడి నేతగా వ్యవహరిస్తున్న జగన్‌కు, సిమన్సన్ (37)తో పాటు మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. సిమన్సన్‌కు ఏడాదిన్నర క్రితం మనపట్టికి చెందిన ధరణితో వివాహం అయ్యింది. అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆస్తి పంచాలని సిమన్సన్ గొడవ పడేవాడు.
కుటుంబంలోని మిగిలిన వాళ్లకు ఆస్తి పంచుకోవడం ఇష్టం లేదు. తూత్తుకుడికి చెందిన ఓ పోలీసు అధికారి ఈ అన్నదమ్ముళ్ల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యతకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్, సిమన్సన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆస్తి పంచే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పేశాడు. అదే సమయంలో సిమన్సన్ భార్య ధరణి ఆగ్రహంతో తన పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లడం, అన్నయ్య ఆస్తి పంచకపోవడంతో ఆగ్రహానికి గురైన సిమన్సన్ రాత్రి సమయంలో తన మిత్రులు మారి, నారాయణన్‌లతో కలసి ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన జగన్ తన వద్ద ఉన్న తుపాకీతో సిమన్సన్‌ను కాల్చాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్ముడి హత్య అనంతరం విదేశాలకు పారిపోయేందుకు జగన్ ప్రయత్నించాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం విమానాశ్రయంలో మంగళవారం జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.