
సాక్షి, సికింద్రాబాద్ : చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేశామని నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్ మీడియాకు తెలిపారు. తనకు దక్కదనే కసితోనే ఇర్ఫానాను నిందితుడు షోయబ్ హతమార్చాడని వెల్లడించారు. ‘వారాసిగూడలో భవనంపై నుంచి పడి ఓ యువతి రక్తపు మడుగులో ఉందని ఈరోజు ఉదయం 7 గంటలకు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. మృతురాలు ఇర్ఫానా కుటుంబ సభ్యులను విచారించాం. వారు షోయబ్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సమీపంలోని సీసీ ఫుటేజీలో షోయబ్ చిత్రాలు రికార్డయ్యాయి.
(చదవండి : వారాసిగూడలో బాలిక దారుణ హత్య)
ఇర్ఫానా, షోయబ్ గతంలో కలిసి చదువుకున్నారు. ఇర్ఫానాతో వివాహం జరిపించాలని షోయబ్ గతంలో ప్రపోజల్ పెట్టాడు. దానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇది మనసులో పెట్టుకున్న అతను ఇర్ఫానాను హతమార్చాలనుకున్నాడు. ఇద్దరూ వాట్సాప్‌లో నిన్న రాత్రి చాటింగ్ చేసుకున్నారు. టెర్రస్‌పైకి రావాలని రాత్రి ఒంటిగంట సమయంలో షోయబ్ చెప్పడంతో ఆమె అక్కడకు వెళ్లింది. దీంతో షోయబ్ అక్కడే ఉన్న బండరాయితో యువతిపై దాడిచేశాడు. పదునైన రాయితో ఆమె గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని బిల్డింగ్ పైనుంచి తోసేశాడు. ఈకేసులో షోయబ్ ఒక్కడే నిందితుడు. అన్ని కోణాల్లో కేసు విచారణ జరుపుతున్నాం’అని డీసీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment