ప్రవీణ్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటే తాను ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని ఓ వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడాడు. లండన్ నుంచి వస్తున్న తనను కిడ్నాప్ చేసి డబ్బు, నగలు దోచుకెళ్లారంటూ తల్లిదండ్రులను నమ్మించాడు. కన్నవాళ్లను, పోలీసులను తప్పుదోవపట్టించి... చివరకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దమ్మాయిగూడకు చెందిన ప్రవీణ్ చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. తమ కొడుకు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడని ప్రవీణ్ తల్లిదండ్రులు మురిసిపోయారు. కుమారుడు పిల్లాపాపల్తో కళకళడుతుంటే చూసి సంతోషించాలనుకున్నారు. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. అయితే తాను పెళ్లి చేసుకుంటే లండన్‌లో ఉద్యోగం చేయటం లేదన్న సంగతి బయటపడుతుందనుకున్న ప్రవీణ్ ఓ పథకం వేశాడు.
లండన్ నుంచి వచ్చిన తనను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని, తీవ్రంగా కొట్టి తన వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకెళ్లాడని తండ్రి శేషగిరికి ఫోన్ చేశాడు. దీంతో శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. అయినప్పటికి కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల దృష్టి ప్రవీణ్ మీదకు మళ్లింది. ప్రవీణ్‌పై అనుమానం వచ్చిన పోలీసులు కొంచెం గట్టిగా అతడ్ని విచారించేసరికి అసలు నిజం బయటపెట్టాడు. పెళ్లి ఇష్టం లేకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విచారణలో వెల్లడించాడు. చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను మోసం చేసినట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment