ప్రతీకాత్మక చిత్రం
లక్నో : మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా ఓ వ్యక్తి మరొకరికి ఫోన్ అమ్మడం దారుణ ఘటనలకు దారితీసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ పరిణామాలు 35 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ముజఫర్‌నగర్‌లోని గంగ్‌నహర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడే వరకూ వెళ్లాయి. మీరట్‌లో స్ధిరపడిన ఈ మహిళ మరణించగా, ఆమె కుమారుడిని ప్రాణాలతో కాపాడారు.
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు చెప్పారు. బాధితురాలి మాజీ బాయ్‌ఫ్రెండ్ మీరట్‌కు చెందిన శుభమ్ కుమార్ ఆమెతో కలిసి అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా అదే పట్టణానికి చెందిన మరొకరికి తన మొబైల్ ఫోన్‌ను విక్రయించాడు. ఈ ఫోటోలను ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రజాపతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
దీంతో తీవ్రంగా కలతచెందిన బాధితురాలు ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి బ్రిడ్జిపై నుంచి ఐదేళ్ల కుమారుడితో సహా కిందకి దూకారు. ఆత్మహత్య చేసుకునే ముందు మహిళ తన భర్తతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, శుభమ్ అతని స్నేహితులు కలిసి ఫోటోలను షేర్ చేసిన ప్రజాపతిని మే 23న హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రజాపతి హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. సహరన్‌పూర్ పోలీసులు శనివారం జరిపిన ఎన్‌కౌంటర్‌లో నిందితులను అరెస్ట్ చేసి వారిని మీరట్ పోలీసులకు అప్పగించారు. కాగా, హత్య కేసు విచారణలో తన పేరు కూడా బయటకు వస్తుందన్న భయంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment