
పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో అతన్ని పరీక్షించేందుకు ప్రయత్నించగా అతడు దాన్ని లాక్కుని కారులో ఉడాయించాడు.
టీ.నగర్: అడయార్ సమీపంలో శనివారం కారులో ప్రయాణిస్తున్న మందుబాబు పోలీసుల నుంచి బ్రీత్ ఎనలైజర్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకుని బ్రీత్ అనలైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై వేలచ్చేరికి చెందిన భూషణ్ అన్నావర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు శనివారం తన లగ్జరీ కారులో అడయార్ వైపుగా వెళుతుండగా సత్యా స్టూడియో సమీపంలో ట్రాఫిక్ పోలీసులు కారును నిలిపి తనిఖీ జరిపారు.
ఆ సమయంలో భూషన్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో అతన్ని పరీక్షించేందుకు ప్రయత్నించగా అతడు దాన్ని లాక్కుని కారులో ఉడాయించాడు. దీంతో పోలీసులు సమీప ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. భూషణ్ కారును వెంబడించి అతని వద్ద నుంచి బ్రీత్ ఎనలైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసి అభిరామపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.