రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రశాంతిని విచారిస్తున్న పోలీసులు
బద్వేలుఅర్బన్ : కారణమేదైనా రెండు నిండు ప్రాణాలు బలయ్యేపరిస్థితి ఏర్పడింది. ఓ యువతి గొంతు కోసి తాను గొంతు కోసుకున్న సంఘటన ఆదివారం పట్టణంలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని సుందరయ్యకాలనీకి చెందిన షేక్ ఖాదర్‌వల్లి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తుండేవాడు. ఇతనికి భార్య ఓ కుమారుడు ఉన్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయనగర్‌కు చెందిన బండి ప్రశాంతికి భర్త ఓబయ్య. ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రశాంతి రెండేళ్ల కిందట ఖాదర్‌వల్లి నిర్వహిస్తున్న దుకాణంలో పని చేస్తుండేది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదే సమయంలో ఖాదర్‌వల్లి ప్రశాంతికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. కువైట్‌లో ఉంటున్న ఆమె భర్త స్వగ్రామానికి వచ్చిన తర్వాత దుకాణంలో పని మానిపించాడు.ప్రశాంతి ఏడాది నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిలో చేరింది.
ఈ సమయంలో తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని లేకపోతే తన వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఖాదర్‌వల్లి ఒత్తిడి తెస్తుండేవాడని తెలిసింది. ఇదే సమయంలో ప్రశాంతి కూడా తనకు నువ్వే బాకీ పడతావని ఖాదర్‌వల్లితో వాదిస్తుండేదని తెలిసింది. ఇరువురి మధ్య ఏర్పడిన విభేదాలు పెద్ద మనుషుల పంచాయితీ దాకా వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మాట్లాడాలని ప్రశాంతిని దుకాణంలోకి పిలిపించిన ఖాదర్‌వల్లి గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి ఖాదర్‌వల్లి ప్రశాంతిని కత్తితో గొంతు భాగంలో గాయపరిచాడు.ఆమె తప్పించుకుని తాను పని చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు ఖాదర్‌వల్లి దుకాణంలోకి వెళ్లి చూడగా అప్పటికే కత్తితో గొంతుకోసుకుని అతను రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు.వెంటనే స్థానికులు ఖాదర్‌వల్లిని, ఆసుపత్రి సిబ్బంది శాంతిని ప్రైవేటు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్‌ఐ చలపతినాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అలాగే హత్యాయత్నానికి ఉపయోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు తెలిసింది. అలాగే బద్వేలు సీఐ రెడ్డప్ప, ఎస్‌ఐ చలపతి నాయుడులు రిమ్స్‌కు వెళ్లి ఇద్దరి వాగ్మూలాన్ని రికార్డు చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment