నిందితులను అరెస్ట్ చూపుతున్న డీఎస్సీ కె.నాగేశ్వరరావు, రూరల్ సీఐ యు.శోభన్‌బాబు
చిలకలూరిపేటరూరల్: వివాహేతర సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో సోదరి భర్తతో కలిసి వ్యూహాత్మకంగా హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట డీఎస్సీ కె.నాగేశ్వరరావు చెప్పారు. డీఎస్సీ, రూరల్ సీఐ యు.శోభన్‌బాబుతో కలిసి సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె శ్రీవిద్యతో వివాహం అయింది. శ్రీవిద్యకు వివాహానికి ముందుగానే సోదరి భర్త అయిన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన గొట్టిపాటి వీరయ్య చౌదరి అలియాస్ వాసు, వీరాంజనేయులకు వివాహేతర సంబంధం ఉంది.
వివాహానంతరం శ్రీవిద్య అక్రమ సంబంధం కలిగి ఉన్న అక్క భర్త అయిన వీరయ్య చౌదరితో మాట్లాడుకోవటానికి, కలుసుకునేందుకు ఆటంకంగా మారింది. శ్రీవిద్య తన భర్తను అడ్డుతొలగించుకునేందుకు అక్క భర్త అయిన వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన గుంజి బాలరాజు, ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పూజల చౌడయ్యలతో కలిసి ముందస్తుగా పథకం సిద్ధం చేశారన్నారు. గత డిసెంబర్ 19న కారులో శ్రీవిద్య భర్త అయిన నరేంద్రతో పాటు నిందుతులతో కలిసి ప్రయాణించారన్నారు. గుంటూరు – కర్నూలు రోడ్డులోని కొత్తపాలెం దాటిన అనంతరం మార్కాపురం రోడ్డులో సైనేడ్ కలిపిన మద్యం తాగించారన్నారు. మరణించిన అనంతరం మృతదేహాన్ని నాదెండ్ల మండలంలోని సాతులూరు గ్రామ పరిధిలోని పొనుగుపాడు కాలువ గట్టుపై పడేసి వెళ్లారన్నారు.
రూరల్ సీఐ యు.శోభన్‌బాబు దర్యాప్తు చేశారన్నారు. నిందితులు నరసరావుపేటలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసులో మృతుడి భార్య శ్రీవిద్య అరెస్ట్ కావాల్సి ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీఐతోపాటు నాదెండ్ల ఎస్‌ఐ కె.చంద్రశేఖర్, పిఎస్‌ఐ ఎస్.రామాంజనేయులు, హెడ్‌కానిస్టేబుల్స్ బాబూరావు, ఇసాక్, కానిస్టేబుల్స్ తిరుపతిరావు,కోటేశ్వరరావు, వెంకట్రావు, శశికుమార్, బెనర్జీ, తిరుపతమ్మ, హాంగార్ఢులు ఇస్రాయేలు, చిన్నబ్బాయి, ఆలీ, ఆశీర్వాదం కృషి చేశారని వీరిని అభినందించారు.
నిందితులను పట్టించిన చెప్పు.. బండి తాళాలు
హత్య జరిగిన ప్రదేశంలో రూరల్ సీఐ పరిశీలించి సంఘటనా స్థలంలో మృతుడికి చెందిన ఒకటే చెప్పు ఉండటంతో పాటు ప్యాంటు జేబులో ద్విచక్ర వాహనం తాళం ఉన్నా సమీపంలో బండి కనిపించకపోవటంతో అనుమానాస్పద మృతిని, హత్యగా భావించి ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భర్తను భార్య ఆధ్వర్యంలోనే హత్య చేయించినట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment