స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపేడుతున్న సీపీ కార్తికేయ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. వీరు గంజాయి ఎవరి నుంచి తెచ్చారు, ఎవరికి సప్లయ్ చేస్తున్నారో వారి కోసం సైతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీపీ తెలిపారు. ఈ సంఘటన వివరాలను శుక్రవారం ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీపీ విలేకరులతో వెల్లడించారు.
డిచ్‌పల్లి మండలం దేవ్‌నగర్(అమృతాపూర్)కు చెందిన ఏ2 గువ్వల దేవయ్య అలియాస్ డేవిడ్ నెల క్రితం నిజామాబాద్ బస్టాండ్ వద్ద గంజాయి ప్రధాన సూత్రదారి హైదరాబాద్‌కు చెందిన ఏ1 సుదర్శన్‌ను కలిశాడు. సుదర్శన్ తాను గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపి గంజాయిని ముంబాయిలోని సిగ్నగల్లిలో ఉండే వ్యక్తికి సప్లయ్ చేస్తే కమిషన్ ఇస్తానని తెలిపాడు. దీనికి దేవయ్య ఒప్పుకున్నాడు. సుదర్శన్ ఓ కారులో ఐదు పెద్ద బ్యాగ్‌ల్లో 176 కిలోల గంజాయిని దేవ్‌నగర్‌కు పంపాడు.
దీనిని దేవయ్య తన బామ్మర్ది రాజారత్నం ఇంట్లో నిల్వ చేశాడు. వీటి నుంచి 13 ప్యాకెట్లు 26 కిలోల గంజాయిని దేవయ్య అతడి తమ్ముడి భార్య గువ్వల శారద కలిసి గత గురువారం ఏపీ 25ఎక్స్ 3559 నంబరు గల ఆటోలో నిజామాబాద్‌కు తెచ్చారు. నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి ఆరేంజ్ బస్సు నం.ఏఆర్ 02 5665లో ముంబయికి గంజాయి తీసుకెళ్లేందుకు టిక్కెట్లు తీసుకున్నారు. ఈ విషయం వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లకు తెలిసింది.
దీంతో అప్రమత్తమైన ఎస్‌ఐ ఇద్దరు కానిస్టేబుళ్లతో ట్రావెల్స్‌కు చేరుకుని బస్సులో తనిఖీలు చేశారు. 26 కిలోలు గల 13 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. వీటిని ముంబయికి తరలిస్తున్న దేవయ్య, శారదను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. అనంతరం వీరిని విచారించగా దేవయ్య బామ్మర్ది రాజారత్నం ఇంట్లో పెద్ద ఎత్తున గంజాయి నిల్వ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో పోలీసులు అక్కడకు వెళ్లి 150 కిలోలు గల 75 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
రాజారత్నం ఆ సమయంలో ఇంట్లో లేక పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన సూత్రదారి సుదర్శన్ కోసం పోలీసులు గాలిస్తున్నారని, త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుల్స్ ప్రసాద్‌గౌడ్, నరేష్‌ను సీపీ అభినందించారు. వీరికి త్వరలో రివార్డులు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్, ఎస్‌ఐ గౌరేందర్ పాల్గొన్నారు.
అనుమానితులను తనిఖీ చేస్తాం..
రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేసే అనుమానిత ప్రయాణికులను ముమ్మరంగా తనిఖీలు చేయనున్నట్లు సీపీ కార్తికేయ తెలిపారు. ప్రయాణికులకు చెందినవి పెద్ద బ్యాగ్‌లు ఏమైన ఉంటే వాటిని తనిఖీలు చేయాలని రైల్వే, ఆర్‌టీసీ అధికారులకు లేఖ రాస్తామని సీపీ చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వారికి కూడా తనిఖీలు చేయాలని, ఈ బస్సుల్లో చట్టవ్యతిరేక పనులు, అక్రమ తరలింపులు ఏమైన బయటపడితే ఆ బస్సులను సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment