పోలీసులు పట్టుకున్న గంజాయి,నగదు
నక్కపల్లి(పాయకరావుపేట): ముందస్తు సమాచారంతో పోలీసులు దాడిచేసి వేంపాడు వద్ద 35 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చింతపల్లి నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో గురువారం వేకువజామున వేంపాడు టోల్‌గేట్ వద్ద ఎస్‌ఐ పి.సింహాచలం, సిబ్బందితో కలిసి దాడి చేశారు. కారులో తరలిస్తున్న సుమారు 35 కిలోల గంజాయి ప్యాకెట్లను, కారు, రూ3,19,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.75వేలు ఉంటుందని అంచనా. గంజాయి రవాణా కేసులో వేంపాడు గ్రామానికి చెందిన ఎం.శ్రీను, నెల్లిపూడి గ్రామానికి చెందిన కె.సతీష్, ఉద్దండపురం గ్రామానికి చెందిన పి.భవానీ, నామవరానికి చెందిన ఇసరపు అప్పలరాజు ,పక్కుర్తి శివలను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ సింహాచలం చెప్పారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్‌ఐ నజీర్, హెచ్‌సీలు పరమేశ్, నర్సింగరావు, సిబ్బంది రామకష్ణ, రమణ, దుర్గాభవానీ తదితరులు పాల్గొన్నారు
వేంపాడు, టోల్‌గేట్ పరిసరాలే స్థావరాలు
కొంతకాలం నుంచి ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడుకాకండా గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వేంపాడు,టోల్‌గేట్ పరిసర ప్రాంతాలను వ్యాపారులు గంజాయి రవాణాకు స్థావరాలుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఇటీవల కాలంలో గంజాయి ఎక్కువగా టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లోనే పట్టుబడుతుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది.ఏజెన్సీ వాసులతో పాటు,చెన్నైకు చెందినవారే గంజాయి రవాణా చేస్తున్నారని ఇప్పటి వరకు భావించారు. కానీ ఈ వ్యాపారంలో స్థానికుల పాత్ర కూడా ఉన్నట్టు గురువారం గంజాయి చిక్కడంతో తెలుస్తోంది. స్మగ్లర్ల మధ్య తలెత్తిన విబేధాల కారణంగానే పోలీసులకు సమాచారం అందుతోంది. గంజాయి వ్యాపారంలో ఉద్దండపురానికి చెందిన మహిళ కూడా ఉండడం చర్చనీయాంశమైంది. ఏజెన్సీ నుంచి గంజాయిని తెచ్చి వేంపాడు, ఉద్దండపురం గ్రామాల్లోపలు ఇళ్లల్లో నిల్వచేసి, బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిసింది. ఈవిధంగా గురువారం చింతపల్లి నుంచి గంజాయిని వేంపాడు తరలించి, అక్కడనుంచి ఇతర ప్రాంతాలకు చేరవేసే క్రమంలో వ్యాపారుల మధ్య ఏర్పడిన విబేధాలు కారణంగా దొరికిపోయినట్టు భావిస్తున్నారు. నిందితుల్లో పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన వారు కూడా ఉండడంతో అక్కడ కూడా పూర్తిస్థాయిలోవిచారణ జరపాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment