
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్ : ఏలూరు కోటదిబ్బలోని జిల్లా జైలులోకి యథేచ్ఛగా గంజాయి వెళుతోంది. జైలులోని ఖైదీలు భోజన విరామ సమయంలో బ్యారెక్‌ల నుంచి బయటకు వచ్చే సమయంలో జైలు వెనుక భాగంలోని అంగన్‌వాడీ స్కూల్ నుంచి కొందరు గంజాయి, గుట్కా, బీడీలను విసరటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం భోజన విరామ సమయంలో ఏలూరుకు చెందిన కొందరు యువకులు జైలులోకి గంజాయి, గుట్కా, బీడీలు, సిగరెట్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన జైలు సెంట్రీలు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఒక ప్రాంతంలో ఇటీవల కొందరు యువకులు కత్తులతో దాడులు చేసుకునేందుకు తిరిగటంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నిందితుల వద్దకు ఈ రోజు కొందరు యువకులు ములాకత్‌కు వచ్చారనీ, భోజన విరామ సమయంలో ఇలా గంజాయి విసిరి ఉంటారని జైలు అధికారులు చెబుతున్నారు. జైలు అధికారులు, సెంట్రీలు అప్రమత్తంగా ఉండటంతోనే ఇటువంటి వాటికి చెక్ పెడుతున్నామని అంటున్నారు.
ఇద్దరు యువకులను అప్పగించాం : బి.చంద్రశేఖర్, జైలు సూపరింటిండెంట్ : ఏలూరులోని జిల్లా జైలులోకి కొందరు యువకులు గంజాయి, గుట్కాలు, బీడీలు బుధవారం విసిరారు. ఈ విషయాన్ని పసిగట్టిన సెంట్రీలు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు అప్పగించాం. ఇదే విధంగా గతంలోనూ కొందరు యువకులు గంజాయి విసురుతూ పట్టుబడగా పోలీసులకు అప్పగించామని, జైలు వద్ద విధులు నిర్వర్తించే సెంట్రీలు అప్రమత్తంగా ఉండడంతో ఇటువంటి వారిని వెంటనే నిలువరించగలుగుతున్నామన్నారు. ఇదిలా ఉండగా, పోలీసులు మాత్రం తమ వద్ద ఎవరూ లేరని, కేసులేమీ నమోదు చేయలేదని చెప్పడం గమనార్హం.
టీడీపీ నేతల సెటిల్‌మెంట్ ? : జిల్లా జైలులోకి గంజాయి విసురుతూ పట్టుబడిన యువకులు ఇద్దరిని ఏలూరు వన్‌టౌన్ స్టేషన్‌లో ఉంచటంతో వెంటనే టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారిద్దరిపై కేసులు లేకుండా బయటకు తీసుకువెళ్ళేందుకు మంతనాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు పెట్టేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ నేతల ఒత్తిడితో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ చిన్న విషయానికి టీడీపీ నేతల జోక్యం పెరిగిపోయిందనీ, ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయాలో తెలియటం లేదంటూ వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment