ప్రియుడితో జల్సాల కోసం దొంగపెళ్లి.! | marriage for the enjoy with lover | Sakshi
Sakshi News home page

ప్రియుడితో జల్సాల కోసం దొంగపెళ్లి.!

Published Tue, Jan 30 2018 7:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

marriage for the enjoy with lover - Sakshi

పోలీసుల అదుపులో పావని

లంగర్‌హౌస్‌:  ప్రియుడితో జల్సాగా జీవించేందుకు ధనికుడిని పెళ్లి చేసుకొని అత్తవారి ఇంట్లో, స్నేహితురాలి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు వివరాలను లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య విలేకరుల తెలిపారు.  విజయవాడ ఆర్టీసీ కాలనీలో నివాసముండే పావని(28)కి అంబర్‌పేటలో నివాసముండే కిషోర్‌తో మూడు సంవత్సరాల క్రితం  ఓ పెళ్లిలొ పరిచయమేర్పడింది. సట్టా నిర్వహిస్తున్న కిషోర్‌ డబ్బు కోసం మాయమాటలు చెప్పి పావనిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిని ఒప్పించాడు. అనంతరం ఆమె నుంచి డబ్బులు కూడా పలుమార్లు తీసుకున్నాడు.

పావని ఇంటి సభ్యులతో మద్దతు ఉండడంతో అప్పటికే జల్సా జీవితంపై మోజు పెంచుకున్న పావని ప్రియుడితో కలిసి సట్టా నిర్వహిస్తు అప్పుడప్పుడు ముంబయి వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో పావని సొంత పిన్ని ఇంట్లో బంగారు నగలు చోరీ చేసింది. అనంతరం టర్కీ కరెన్సీని సరఫరా చేస్తు గతంలో పోలీసులకు పట్టుబడింది. కొన్ని నెలల క్రితం ఆమె ధనవంతుడైన రమేష్‌ను వివాహం చేసుకుంది. వివాహం జరిగిన 10 రోజులకు రమేష్‌కు ఉద్యోగం రావడంతో సౌతాఫ్రికాకు వెళ్లాడు. పావనిని కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఆమె అత్తవారింట్లో పలుమార్లు చోరీలకు పాల్పడి ఆ సొత్తును ప్రియుడికి ఇస్తుండటాన్ని గుర్తించిన అత్తింటి వారు ఆమెను బయటికి గెంటేశారు.

అయినా వైఖరి మార్చుకోని పావని అమీర్‌పేట్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఉస్మానియాలో ఎంబీఏ చేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురితో స్నేహం పెంచుకుంది. ఎవరికి అనుమానం రాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సట్టా నిర్వహిస్తోంది. వసతి గృహం స్నేహితుల ద్వారా పద్మనాభ నగర్‌కు చెందిన ఉషను పరిచయం చేసుకుంది. గతేడాది డిసెంబర్‌ 19 తేదీ ఉదయం ఉష ఇంటికి వెళ్లిన ఆమె ఎవరూ చూడకుండా  బీరువా తాళాలు తీసుకుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత పావని ఉషకు ఫోన్‌ చేసి తన బ్యాగు ఇంట్లో మరిచిపోయానని చెప్పడంతో అక్కడ వార్డెన్‌ ద్వారా తాళాలు తీయించి ఇంట్లోకి వెళ్లింది. బీరువా నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ప్రియుడితో ముంబయి వెళ్లిపోయింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం శంషాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన పావనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement