సాక్షి, వెదురుకుప్పం(చిత్తూరు) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు... మండలంలోని నల్లవెంగనపల్లె పంచాయతీ కేవీఎం అగ్రహారం దళితవాడకు చెందిన వెంకటేశ్ భార్య వనజ(23) వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఈ విషయంపై అప్పట్లో కుటుంబ సభ్యులు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో అప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వెతకసాగారు.
ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే శుక్రవారం ఉదయం గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బావిలో గుర్తు తెలియని శవం కనిపించడంతో పొలం యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెదురుకుప్పం ఎస్‌ఐ సుమన్‌తో పాటు పోలీసులు, స్థానికులు సంఘనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వనజ(23)గా గుర్తించారు. ముందుగా సరిగ్గా గుర్తించలేకపోయారు. 9 రోజులుగా బావిలో పడి ఉండడంతో శవం ఆనవాళ్లు కోల్పోయింది. మొదట్లో ఆడ మగా అనేది నిర్దారించలేకపోయారు.
బావిలోకి దిగి వనజగా నిర్దారించిన తరువాత స్థానికుల సాయంతో పోలీసులు బావిలోంచి శవాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరుకు తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. వనజ(23) కుటుంబానికి పక్కనే ఉన్న మరో కుటుంబానికి ఉన్న కలహాల కారణంగా మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. ఓ వివాదాస్పద విషయమై జరిగిన సంఘటనతో మనస్తాపం చెంది, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కొందరు, కుట్ర పూరితంగా హత్య చేయించి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. వనజ మృతితో ఇద్దరు పిల్లలు ఆనాథలుగా మిగిలిపోయినట్లు స్థానికులు బోరుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment