కర్నూలు, చిత్తూరు(పూతలపట్టు) : పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో గురువారం వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. రేణిగుంట వినాయకనగర్‌కు చెందిన రమేష్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కే.రమ్య(19)ను పూతలపట్టుకు చెందిన భాస్కర్‌నాయుడు కుమారుడు ఈశ్వర్‌కు ఇచ్చి 2018 ఏప్రిల్‌లో పెళ్లి చేశారు. కొన్నాళ్లకే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భర్తతో పాటు కుటుంబ సభ్యులు రమ్యను కట్నం పేరుతో తరచూ వేధించేవారు.
ఈ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు చెప్పడంతో ఇటీవల రూ.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చి సర్దుబాటు చేశారు. వేధింపులు మాత్రం ఆగలేదు. ఏమి జరిగిందో కాని రమ్య గురువారం ఇంటికి సమీపంలో ఉన్న నీటికుంటలో శవమై తేలింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామంజనేయులు, ఎస్‌ఐ మల్లేష్ యాదవ్, తహసీల్దార్ అక్కడికి చేరుకుని రమ్య మృతికి గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వరకట్న వేధింపులతోనే తమ కూతురు మృతి చెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్తతో పాటు అత్త, మామపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికను బట్టి కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment