
ఆమెకు పెళ్లయింది.. మూడేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆపై గర్భవతి కూడా..
వేలూరు: ఆమెకు పెళ్లయింది.. మూడేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. ఆపై గర్భవతి కూడా.. ఇవన్నీ ఆమెకు అడ్డు కాలేదు. అక్రమ సంబంధం మోజులో కట్టుకున్న భర్తని, కన్న కుమారుడిని వదిలేసి ప్రియుడితో పరారయింది. ఈ సంఘటన గుడియాత్తంలో చోటు చేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం గ్రామానికి చెందిన రాజేష్, పూర్ణిమలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడున్నారు. ప్రస్తుతం పూర్ణిమ నాలుగు నెలల గర్బవతిగా ఉంది. ఇదిలా ఉండగా గుడియాత్తం ఇందిరానగర్‌కు చెందిన పార్థిబన్ కూలీ కార్మికుడు. ఇతనికి వివాహం జరగలేదు. పార్థిబన్‌కు పూర్ణిమకు రెండు సంవత్సరాల క్రితం అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ కలిసి మాట్లాడుకునే వారు. ఈనెల 13వ తేదీన పూర్ణిమ ఆస్పత్రికి వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లి అనంతరం తిరిగి రాలేదు. ఈమె భర్త పలు చోట్ల వెతికినప్పటికీ ఎటువంటి ఆచూకి తెలియరాలేదు.
అయితే పూర్ణిమ ప్రియుడు పార్థిబన్‌తో కలిసి వెళ్లినట్లు తర్వాత భర్తకు తెలిసింది. దీంతో భర్త రాజేష్ సోమవారం ఉదయం గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్ణిమను తీసుకెళ్లిన పార్థిబన్ కోసం గాలిస్తున్నారు.