
సాక్షి, సూర్యాపేట క్రైం: పచ్చని కాపురంలో నిప్పులు పోశాడు.. ఓ మాజీ ఏపీఎస్పీ కానిస్టేబుల్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ పేరుమాళ్ల అశోక్‌రావు ముందుగా ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఓ యువతి రెండున్నర సంవత్సరాల క్రితం కొత్త బస్టాండ్ వద్ద స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుంది. అటుగా వెళ్తున్న అశోక్‌రావును లిఫ్టు అడగగా ఇచ్చాడు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
వివాహం కాలేదనుకుని..
అశోక్‌రావుకు పెళ్లి కాలేదని చెప్పడంతో ఆ మహిళ అశోక్‌రావుతో పరిచయం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురి మధ్య కొంతకాలం వరకు పరిచయం కొనసాగింది. అయితే కొద్దికాలం తర్వాత మహిళకు అశోక్‌రావుకు పెళ్లి అయిన విషయం తెలుసుకుంది. వెంటనే మహిళ టెన్త్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న సమయంలో ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడిపోయింది.
సంవత్సర కాలం క్రితం.. భార్య భర్తల కేసులో సర్వీస్ రిమూవల్
అశోక్‌రావుకు ఉద్యోగం వచ్చిన సమయంలోనే ప్రొబిషనరీ పీరియడ్ పూర్తి కాకముందే సస్పెండయ్యాడు. అదే సమయంలో అశోక్‌రావు, ఆయన భార్య మధ్యలో కోర్టులో పంచాయితీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన కొద్ది కాలానికే ఆయనలో మార్పు రాకపోవడంతో సర్వీస్ రిమూవల్ చేశారు.
యువతి భర్తను కలిసి ఫొటోలు మొహంపై వేసిన వైనం..
బాధిత మహిళకు ఫోన్‌లో వేధిస్తూనే అశోక్‌రావు నేరుగా హైదరాబాద్‌లో నివాసముంటున్న స్థలాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. మహిళ ఆయన మాట వినడం లేదనుకుని.. నేరుగా ఆమె భర్త వాహనాన్ని వెంబడించి ఇరువురు కలిసి దిగిన అప్పటి ఫొటోలను ఆయన మొహంపై విసిరేశాడు.దీంతో చేసేదేమి లేక మహిళ భర్త నేరుగా భార్య వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఆ మహిళ సూర్యాపేట డీఎస్పీని ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని ఆయనకు వివరించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకోమని సిబ్బందిని ఆదేశించాడు.
కౌన్సిలింగ్ చేసినా మారని తీరు..
రెండు వారాల క్రితం బాధిత మహిళ సూర్యాపేట డీఎస్పీని ఆశ్రయించింది. వెంటనే స్పందించిన డీఎస్పీ నాగేశ్వరరావు అశోక్‌రావును కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించారు. అయినా కూడా అశోక్‌రావు తీరులో మార్పు రాలేదు. శనివారం డీఎస్పీ కార్యాలయానికి అశోక్‌రావును మరోమారు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో బాధిత మహిళ అశోక్‌రావు వేధింపులు తాళలేక పక్కనే ఉన్న అశోక్‌రావు చెంప చెల్లుమనిపించింది. ఈ విషయమై డీఎస్పీ నాగేశ్వరరావును వివరణ కోరగా.. అశోక్‌రావుకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు.