మారుతీరావ్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య గిరిజ
సాక్షి, హైదరాబాద్ : ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటనా స్థలం నుంచి పాయిజన్ బాటిల్, సూసైడ్ నోట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు రాసినట్లుగా భావిస్తున్న ఆ సూసైడ్ నోట్‌లో ‘‘ గిరిజ క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాసి ఉంది. ప్రణయ్ హత్య కేసులో ఏ1నిందితుడిగా ఉన్న మారుతీరావుకు కోర్టు కొద్దినెలల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ భయమే చంపేసిందా?..
ప్రణయ్ హత్య కేసు ట్రయల్ చివరి దశకు రావడంతో మారుతీరావు టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు నల్గొండలో అడ్వకేట్లు ఆయనకు సపోర్ట్ చేయలేదు. దీంతో అడ్వకేట్‌ను కలవటానికి శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. నల్గొండలో కేసు అనుకూలంగా రాకపోయినా హైకోర్ట్‌కు వెళదామనే ఆలోచనలో ఉన్న ఆయన సరైన న్యాయవాదులు అండగా లేకపోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో కూడా ఆయన వెంట ఓ అడ్వకేట్ ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రుడికి చెందిన ఓ ఫర్టిలైజర్ షాపులోనే మారుతీరావు పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు విషయంలో కూతురు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదనే మనోవేదనలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment