రాజా- కనిమొళి.. (పాత చిత్రాలు)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కుంభకోణంగా పేరొందిన 2జీ కుంభకోణం అంశం మళ్లీ తెరపైకి వచ్చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తీర్పుపై సుప్రీంకోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ మేరకు సీబీఐ, ఈడీలకు పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు కేసులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ ‘తుషార్ మెహతా’ పేరును స్పెషల్ పబ్లిస్ ప్రాసిక్యూటర్‌గా ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న ఆనంద్ గ్రోవర్‌ను స్థానంలో మెహతా నియమితులయ్యారన్న మాట. ఈ మేరకు గురువారం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న సీబీఐ పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది.
కాగా, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతో 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి(కరుణానిధి కూతురు)తో సహా 17 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే. తీర్పు అనంతరం సీబీఐ, ఈడీ విభాగాలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ తీర్పుతో సీబీఐ పరువును, ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
మెహతా సరైనోడు..
2008లో గుజరాత్ ప్రభుత్వానికి అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఆయన పని చేశారు. ఆపై కేంద్రం ఆయన్ని 2014లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. కేసు ఎలాంటిదైనా సరే ముఖ్యమైన పాయింట్లతో ఆయన వాదనలు వినిపిస్తారనే పేరుంది. దీంతో 2జీ కేసులో వాదనలకు సమర్థుడిగా పేరున్న ఆయన సరైన వ్యక్తని కేంద్రం నిర్ణయించుకుంది.
తుషార్ మెహతా (పాత చిత్రం)
Comments
Please login to add a commentAdd a comment