
అహ్మదాబాద్ : కథువా ఘటనపై చర్చ కొనసాగుతున్న వేళ గుజరాత్‌లో తొమ్మిదేళ్ల బాలికపై దాష్టీకానికి పాల్పడి .. ఆపై కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉంటే కేసుపై కొందరు నకిలీ వార్తలను వ్యాపింపజేయగా.. పోలీసులు ఇద్దరినీ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఓ బాలిక మృత దేహాన్ని చూపిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి చెందిన వ్యక్తి ఈ పైశాచిక ఘటనకు కారణమంటూ ఫేస్ బుక్, వాట్సాప్‌లలో కొందరు కథనాలను విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ‘ఈ హత్యాచార ఘటనలో విచారణ కొనసాగుతోంది. బాధిత బాలికను ఇంకా గుర్తించే పనిలో ఉన్నాం. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా నకిలీ వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తప్పవు’ సూరత్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
సుమారు 9 నుంచి 11 ఏళ్ల వయసున్న బాలిక మృత దేహాన్ని భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం వద్ద ఏప్రిల్ 6న పోలీసులు గుర్తించారు. ఐదు గంటల పోస్ట్ మార్టంలో అతి కిరాతకంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హింసించి చంపినట్లు నివేదికలో తేలింది. బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నాయని.. పూర్తి నివేదిక కోసం ఫోరెన్సిక్ నివేదికను ఆశ్రయించామని సూరత్ సివిల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాలిక తరపు బంధువులెవరూ ఇంత వరకు తమను ఆశ్రయించలేదని సూరత్ పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment