సాక్షి, కర్నూలు : హిరో విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాలోనుంచి డబ్బు డ్రా చేసుకుంటారు. అచ్చం అలాంటి ఘటననే కర్నూలు జిల్లాలో ఒకరికి జరిగింది. ఆమెకు తెలియకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు సైబర్ నేరస్తులు.
జిల్లాలోని బనగానపల్లే పట్టణం పంచమపేటకు చెందిన పుష్పలతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో ఖాతా ఉంది. గత నెలలో ఆమెకు తెలియకుండానే తన ఖాతాలో నుంచి రూ.61,110 గుర్తుతెలియని వక్తులు డ్రా చేసుకున్నారు. దీంతో ఆ మహిళ బ్యాంక్‌కు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఆమె ఖాతా వివరాలు పరిశీలించగా అసలు విషయాలు బయటపడ్డాయి. బ్యాంక్ అధికారులు పుష్సలత అకౌంట్‌కు వేరే వ్యక్తి ఆధార్‌తో లింకేజ్ చేశారు. దీంతో సైబర్ నేరస్తులు వేలి ముద్రల సహాయంతో డబ్బులు డ్రా చేసుకున్నారు.
గత 25 రోజుల నుంచి బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని పుష్సలత ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. చేసేది ఏమి లేక చివరకి మీడియాను సంప్రదించానని తెలిపారు. బాధితురాలి తరపున వివరణ అడగడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బ్యాంక్ మేజేజర్ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment