అనుమానం.. పెనుభూతం | Mother Killed Girl Child And Commits Suicide Attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

అనుమానం.. పెనుభూతం

Published Wed, Apr 24 2019 8:00 AM | Last Updated on Wed, Apr 24 2019 10:47 AM

Mother Killed Girl Child And Commits Suicide Attempt in Hyderabad - Sakshi

నారాయణ రెడ్డి , సుశీల (ఫైల్‌) , చిన్నారి దీక్ష (ఫైల్‌)

జీడిమెట్ల: అనుమానం పెనుభూతమై అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలిగొంది.. మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భర్త అనుమానిస్తున్నాడని మనస్తాపానికిలోనైన ఓ మహిళ క్షణికావేశంలో తన కుమార్తె (13నెలలు) గొంతు కోసి హత్య చేయడమే కాకుండా తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన  జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.. జీడిమెట్ల సీఐ రమణారెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, తుర్లపాడు మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన వెన్న నారాయణ రెడ్డి, సుశీల(28) దంపతులు నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్, సూరారం డివిజన్‌లోని హెచ్‌ఎంటీ సొసైటీలో ఉంటున్నారు.

నారాయణరెడ్డి  జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ సమీపంలోని శ్రీసాయి మనోజ్ఞ ప్యాబ్రికేషన్‌ పరిశ్రమలో పనిచేసే వాడు. వారిక ఒక కుమార్తె దీక్ష (13నెలలు). అయితే భార్యపై అనుమానం పెంచుకున్న నారాయణ రెడ్డి  తరచూ సుశీల వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి కూడా ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికిలోనైన సుశీల మంగళవారం తెల్లవారు జామున  భర్త నిద్రిస్తుండగా బెడ్‌రూమ్‌కు బయటి నుంచి గడియపెట్టింది. కుమార్తె దీక్షను బాల్కానీలో ఉన్న బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి కూరగాయల కత్తితో గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో దీక్ష అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి ఏడుపులు విన్న నారాయణ రెడ్డి తలుపులు కొడుతుండటంతో తలుపు తీసిన సుశీల పరుగు పరుగున బాత్‌రూమ్‌ లోకి వెళ్లి గడియ పెట్టుకుని తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారి అరుపులు విన్న పక్కింటివారు బాత్‌రూమ్‌ గడియ తీసి సుశీలను సూరారంలోని నారాయణ మల్లారెడ్డి అస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో  గాంధీ అస్పత్రికి తరలించారు. సుశీల తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉలిక్కిపడ్డ స్థానికులు..
తెల్లవారు జామున పోలీసులు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 13నెలల చిన్నారిని తల్లి హత్య చేసిందని తెలియడంతో నివ్వెరపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement