
ఆస్పత్రిలో పసికందు
వికారాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళ అమానవీయ ఘటనకు పాల్పడింది. కన్నపేగును పంచుకొని పుట్టిన బిడ్డను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. వికారాబాద్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆటోలో వచ్చిన ఓ మహిళ.. సుమారు ఒకరోజు వయసున్న మగ శిశువును రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై వదిలేసి వెళ్లినట్లు కొందరు వాహనదారులు చెబుతున్నారు. ముందుగా ఏదో వస్తువు అయి ఉంటుందని భావించారు.
విషయం తెలుసుకునే సరికి సదరు వ్యక్తులు వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న వికారాబాద్‌లోని డెంటల్ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్ విషయాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ లక్ష్మయ్య అక్కడికి చేరుకున్నారు. శిశువును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వాహనంలో తరలించారు. సూపరింటెండెంట్ శాంతప్ప చికిత్స చేశారు. శిశువు బరువు 1.6 కిలోలు ఉండటంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహేతర సంబంధం నేపథ్యంలో గర్భం దాల్చిన మహిళ, విషయం బయటకు పొక్కుతుందనే భయంతో శిశువును వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ యాదప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment