
సాక్షి, విజయవాడ: కిరాయి హంతకుల ముఠా పట్టపగలే కత్తులతో స్వైర విహారం చేయడంతో నగర ప్రజలు భయందోళనలకు గురయ్యారు. వివరాలు.. దుర్గాపురంలోని అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సదాశివ ప్రసాద్ ఇంట్లోకి గురువారం దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాల కనెక్షన్లని తొలగించారు. ఆయన కుమారుడు సాగర్‌పై కత్తులతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కత్తులతో బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
దేహశుధ్ది..
దాడి చేసి పారిపోతున్న దుండగుల్ని తీవ్రంగా ప్రతిఘటించిన స్థానికులు చివరకు ముఠాలోని ఇద్దరిని పట్టుకోగలిగారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఘటనలో సాగర్ గాయపడ్డారు. దాడి ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు నిరాకరించడం గమనార్హం. ఇక అగ్రిగోల్డ్ మోసం కేసులో సదాశివ ప్రసాద్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సంస్థకు భూముల కొనుగోళ్లలో ప్రసాద్ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment