
నిందితుడు ఆసిఫ్
ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి.
బంజారాహిల్స్: భర్త ఇంట్లో లేని సమయంలో మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించగా అడ్డుకుందన్న కోపంతో కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బంబారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బసవతారకం నగర్ బస్తీకి చెందిన షేక్ జబ్బర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య నసీంభాను గృహిణి. వీరికి ఒక కుమారుడు కాగా, ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి.
పెళ్లికి ముందు ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ భర్త లేని సమయంలో అతను ఇంటికి వచ్చేవాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆసిఫ్‌ను ఇంటికి రావద్దని వారించిన నసీంభాను అతడిని దూరం పెడుతోంది. సోమవారం రాత్రి ఆసీఫ్ ఆమె ఇంటికి రాగా తనను ఇబ్బంది పెట్టవద్దని, ఇకపై ఇంటికి రావద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆసీఫ్ పథకం ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో నసీంబాను కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమె సోదరుడు సద్దాంకు సమాచారం అందించడంతో అతను తన బావ జబ్బార్‌తో కలిసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలి భర్త జబ్బార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసిఫ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రవిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.