
గాయపడిన చిన్నారితో తల్లి సోని
భాగ్యనగర్‌కాలనీ: కన్న కూతురినే బస్సు కిందకు తోసేందుకు యత్నించిన .ఓ తల్లికి స్థానికులు దేహ శుద్ధిచేసి కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే బోయినపల్లికి చెందిన సోని తన కుమార్తె శిరీష(2)తో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తన భర్త రెండవ వివాహం చేసుకోవడంతో కుమార్తె పోషణ భారమై ఆమెను వదిలించుకునేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్‌కాలనీలో ఆర్‌టీసీ బస్సు కిందకు తోసేందుకు యత్నించగా, అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేయటంతో ప్రమాదం తప్పింది. అంతటితో ఆగకుండా చిన్నారిని రోడ్డుపైకి విసరటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గుర్తించిన స్థానికులు ఆమెను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీ, కూతురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.