
నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
సాక్షి, సిరిసిల్ల : రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ హత్యకేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసింది. ఇందుకు కారణమైన ఎనిమిది మందిలో నలుగురు లొంగిపోయినట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అరెస్ట్ చూపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
మూడపల్లికి చెందిన గోలి తిరుపతితో అదే గ్రామానికి చెందిన కడారి తిరుపతి చెల్లెలికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే గోలి తిరుపతి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. సర్పంచ్ గోలి శంకర్.. గోలి తిరుపతికి వరుసకు అన్న అవుతాడు. అదే చొరవతో తిరుపతి భార్యతో చనువు గా ఉంటున్నాడు. కడారి తిరుపతి, కడారి మహేందర్ సోదరులు. కొద్ది రోజుగా గోలి శంకర్‌పై అనుమానం పెంచుకొని గొడవ పడుతున్నారు.
పక్కా పథకంతోనే..
ఎలాగైనా శంకర్‌ను హతమార్చాలని కడారి సోదరులు పథకం పన్నారు. ఆ బాధ్యతను మహేందర్‌కు అప్పగించాడు తిరుపతి. ఆరోగ్యం బాగోలేదని చికిత్సకు కేరళ వెళ్తున్నట్లు వేములవాడ పీఎస్‌లో లెటర్ ఇచ్చాడు. అనంతరం మహేందర్ ఆన్‌లైన్‌లో పెప్పర్ స్ప్రే కొనుగోలు చేశాడు. తన అను చరులైన శివ, రాజేష్ సాయంతో హైదరాబాద్‌లో మూడు వేటకొడవళ్లు కొన్నారు. శంకర్‌ను చంపడానికి రెక్కీ నిర్వహించారు. మే11న మూడపల్లి ఎల్లమ్మ టెంపుల్ వద్ద మాటేసినా సాధ్యపడలేదు.
మాటేసి...
ఈ నెల 13న నూకలమర్రిలో కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి శంకర్ వస్తునట్లు తెలుసుకుని అనుచరులు శివ, రాజేశ్‌లతో కలసి మ హేందర్ హన్మక్కపల్లి శివారులో మాటేశాడు. కోళ్ల ఫారం వరకు శంకర్ కారులో రాగానే శివ కారుతో వెంబడించి ఢీకొట్టాడు.
శంకర్‌కారు రోడ్డుకు అడ్డంగా తిరగ్గా శివ కారు పక్కన దిగబడిపోయింది. శంకర్‌కారు దిగగానే శివ అతడి మొహంపై పెప్ప ర్ స్ప్రే చేశాడు. రాజేష్, మహేందర్ వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆ వెంటనే బైక్‌పై కరీం నగర్ మీదుగా హన్మకొండ వెళ్లి అక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్‌ల్లో తల దాచుకున్నారు.
ఒకరికి బదులుగా...
తిరుపతి తన ప్రధాన అనుచరుడు చొప్పరి శివను కేసు నుంచి తప్పించడానికి మహేశ్, గంగరాజుల సహాయంతో బైరెడ్డి వినయ్‌కి నేరం ఒప్పుకుంటే రూ. లక్ష ఇస్తామని తెలిపాడు. వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో కడారి మహేందర్, నేదురి రాజేష్, బైరెడ్డి వినయ్, ఎడపల్లి విష్ణు లొంగిపోయారు. మరోనలుగురు కడారి తిరుపతి, చొప్పరి శివ, గంగరాజు, మహేష్‌లు పరారీలో ఉన్నారు. సమావేశంలో ఏఎస్పీ రవీందర్, డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ సీఐ వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment