
చంపిన వ్యక్తి శేఖర్
కుటుంబ తగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి. ఐదు వేల రూపాయల కోసం సొంత బావమరిదిని కిరాతకంగా హతమార్చాడు. భార్య వైద్యం కోసం ఖర్చు చేసిన మొత్తం ఇవ్వలేదన్న అక్కసుతో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. మానవ సంబంధాలు కాస్తా మనీ సంబంధాలు మారుతున్నాయనడానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్) : కుటుంబ కలహాల నేపథ్యంలో బావాబావమరదుల మధ్య జరిగిన వివాదంలో బావమరిదిని బావ హతమార్చిన ఘటన సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన చదలవాడ రాజు(34) రైల్వేలో గేట్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. అతడు తన సోదరి జ్యోత్స్నను విజయవాడ సత్యనారాయణపురంలో నివసించే రైల్వేలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న కందవల్లి శేఖర్‌కి ఇచ్చి 2015లో వివాహం చేశాడు. వారికి పాప ఉంది. అయితే పెళ్‌లైనప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది. ఈక్రమంలో మూడునెలల క్రితం జ్యోత్స్నకు ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అందుకు రూ.5వేలు శేఖర్ ఖర్చుపెట్టాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. అయితే తాను ఖర్చుచేసిన డబ్బును పుట్టింటి వారే ఇవ్వాలని నిర్ణయించి, వాటికోసం శేఖర్ గొడవపడుతున్నాడు.
ఇదిలా ఉండగా రాజు ఉద్యోగ నిర్వహణలో భాగంగా శిక్షణ కోసం సత్యనారాయణపురం రైల్వే శిక్షణ కార్యాలయానికి వచ్చాడు. సోమవారం విరామసమయంలో బయటకు వచ్చిన రాజును కలిసిన శేఖర్ కొత్తగా ద్విచక్ర వాహనం కొనేందుకు డబ్బులుంటాయి గాని నాకు ఇవ్వడానికి ఉండవా అంటూ ఘర్షణకు దిగాడు. మాటా మాటా పెరగడంతో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో శేఖర్ కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజును రైల్వే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజు కుటుంబ సభ్యులు రైల్వే ఆస్పత్రికి తరలివచ్చారు. అక్కడ నుంచి మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment