ప్రేమ వ్యవహరమే కారణమా..? | Murder Of A Young Man With Love Affair | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహరమే కారణమా..?

Published Sun, Jul 21 2019 8:16 AM | Last Updated on Sun, Jul 21 2019 8:38 AM

Murder Of A Young Man With Love Affair - Sakshi

సాక్షి, కంబదూరు: ప్రేమ వ్యవహారానికి ఓ నిండు ప్రాణం బలైంది. మండల కేంద్రం కంబదూరుకు చెందిన ఎరుకల రవి (20) హత్యకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఎరుకుల సర్థానప్ప, అంజినమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో మూడో కుమారుడైన ఎరుకల రవి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కళ్యాణదుర్గం మండలం దాసంపల్లికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. అయినప్పటికీ వీరి మధ్య ఫోన్‌ సంభాషణలు కొనసాగుతుండేవి. అమ్మాయి మెట్టినింటికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉండేది. భర్త వద్దకు వెళ్లాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అమ్మాయి వినకుండా రవితో ప్రేమాయణం కొనసాగించింది. ఈ విషయమై కుటుంబంలో తరచూ గొడవలు కూడా జరిగాయి.
 
పథకం ప్రకారమే హత్య 
అమ్మాయిలోను, రవిలోను మార్పు రాలేదు. ఇక రవిని అడ్డు తొలగించుకోవడమే మేలని అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే దాసంపల్లిలో ఉన్న రవి స్నేహితున్ని అమ్మాయి బంధువులు ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం రవి స్నేహితులతో కలిసి కళ్యాణదుర్గంలో సినిమా చూసి కంబదూరుకు వచ్చాడు. రాత్రి బంధువుల ఇంటిలో బర్త్‌డే కార్యక్రమం ఉండడంతో రవి అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఎవరో ఫోన్‌ చేసి బయటకు రమ్మన్నారు. వెంటనే రవి ‘మా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేస్తున్నారు. త్వరగా వస్తాను భోజనం చేయండి’ అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి స్నేహితులతో కలిసి చెక్‌పోస్టు ప్రాంతం వద్ద కల్లుదుకాణంలో మద్యం తాగాడు. మత్తులో ఉన్న రవిని గొంతు, ముఖంపై కత్తులతో నరికి చంపేశారు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ 
కంబదూరు మండల కేంద్రంలో జరిగిన హత్యా స్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ మల్లికార్జున వర్మ, సీఐ శివశంకర్‌నాయక్‌లు శనివారం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుని హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్కడ లభించిన కొన్ని ఆధారాలతో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement