ఆకుల కనకదుర్గ ,రాంప్రసాదరావు, తణుకులోని రాంప్రసాదరావు ఇల్లు
పశ్చిమగోదావరి , తణుకు: పెద్ద ఎత్తున ఆక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్న కేంద్ర అటవీశాఖ అభివృద్ధి మండలి ఉన్నతస్థాయి అధికారి (ఉత్తరప్రదేశ్ క్యాడర్) ముత్యాల రాంప్రసాదరావు నివాసంలో మంగళవారం దాడులు చేసిన సీబీఐ అధికారులు దీనికి కొనసాగింపుగా బుధవారం జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తణుకులోని రాంప్రసాదరావు ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయన భార్య ఆకుల కనకదుర్గతోపాటు ఆమె వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న గణపతిశాస్త్రి, మరికొందర్ని విచారించి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బంగారంతోపాటు రూ. 25 లక్షల నగదు, గత మూడేళ్లలో క్రయ విక్రయాలు చేసిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మంగళవారం తణుకులో దాడులు నిర్వహించిన సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఆయన పని చేసిన ప్రాంతంతోపాటు ఢిల్లీలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. మంగళవారం పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయానికి ఆకుల కనకదుర్గ ఆమె పీఏ గణపతిశాస్త్రిని బుధవారం తీసుకువెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించిన బినామీల వివరాలను సేకరించిన అధికారులు వారిని విచారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారం రోజులుగా సీబీఐ అధికారులు రెక్కీ నిర్వహించిన విషయాన్ని పసిగట్టిన రాంప్రసాదరావు కుటుంబ సభ్యులు కీలక డాక్యుమెంట్లు, పెద్ద ఎత్తున బంగా>రాన్ని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మరికొంత దాచిపెట్టినట్లు సమాచారం. వీరు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలను సైతం అధికారులు పరిశీలించారు.
కేంద్ర మంత్రి ద్వారా ఒత్తిడి..?
వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంప్రసాదరావుకు జాతీయ స్థాయిలో రాజకీయంగా పలుకుబడి ఉన్నట్లు చెబుతుంటారు. అంతే కాకుండా రాష్ట్రంలో కొందరు టీడీపీ పెద్దలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో గతంలోనూ ఇతని అక్రమ సంపాదనపై విచారించిన విజిలెన్సు, ఏసీబీ అధికారులు తర్వాతి కాలంలో చేతులెత్తేశారు. తాజాగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగి బయటపడిన అక్రమ ఆస్తులను మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లుగా లెక్కకట్టారు. ఈ మేరకు రాంప్రసాదరావుపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి ఒకరు పరోక్షంగా రాంప్రసాదరావుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నాలుగైదు రోజుల పాటు జరగాల్సిన తనిఖీలు కేవలం ఒక్కరోజుకే పరిమితం చేశారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీకి చెందిన కొందరు పెద్దల ద్వారా కేంద్రమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ దిశగా ఈ వ్యవహారం నీరుగార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడులు సమయంలో సైతం రాంప్రసాదరావు కుటుంబ సభ్యులు ఏం కాదనే ధీమాను ప్రదర్శించడం అనుమానాలకు బలం చేకూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment