నాగరాజు (ఫైల్)
హైదరాబాద్, నాగోలు: వివాహం జరిగి నాలుగు రోజులు గడవక ముందే ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, వాయిల్లపల్లికి చెందిన నాగరాజు (29) ఎల్‌బీనగర్ సూర్యోదయకాలనీలో ఉంటూ నాదర్‌గుల్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న అతడి వివాహం జరిగింది.. మంగళవారం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం భువనగిరికి వెళ్లిన అతను చీకటి పడటంతో సూర్యోదయకాలనీలోని తన గదికి వచ్చాడు. సమీపంలోనే ఉండే అతని సోదరుడు లింగస్వామి కూడా నాగరాజు గదికి వచ్చి అతనితో పాటే ఉన్నాడు.
బుధవారం లింగస్వామి డ్యూటీకి వెళ్లిపోగా, నాగరాజు 8.30కు తండ్రికి ఫోన్ చేసి తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు తనతో పాటు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తండ్రి నాగరాజుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అన్నకు ఫోన్ చేశాడు. లింగస్వామి సమీపంలో ఉంటున్న కిరాణ దుకాణం వారికి ఫోన్ చేయగా వారు గది వద్దకు వెళ్ళి నాగరాజును పిలువగా అతను తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమానికి చెప్పారు. గది తలుపులు పగులగొట్టి చూసేసరికి నాగరాజు స్పృహ తప్పి ఉండటంతో 108కు ఫోన్ చేశారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment