రౌడీ ని విచారిస్తున్న అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్
ఐటీ సిటీలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలకు అదుపు లేదు. వేధింపులు, అత్యాచారాల సంఘటనలు సరేసరి. ఇక భూ దందాలు, హత్యల్లోనూ దేశంలోనే టాప్‌లో ఉంటోందీ ఉద్యాననగరి. ఇలాగైతే కుదరదు, ఓ పట్టు పట్టాల్సిందేనని సీసీబీ పోలీసులు ఆపరేషన్‌ను షురూ చేశారు.
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో నేర కార్యకలాపాలను అడ్డుకట్టవేయడానికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీస్ అధికారులు కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. నగరంలో రౌడీలు, గూండాలను వెంటాడుతున్న సీసీబీ పోలీసులు తమదైనశైలిలో పబ్‌లు, బార్లపై దాడులు ప్రారంభించారు. ఇక చెవులకు పోగులు, చేతులకు కడియం,విచిత్ర తరహాలో జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరిగే యువకులు, నిరంతరం బార్లలో గుంపులుగా కూర్చుని మందుకొట్టేవారిని అదుపులోకి తమదైనశైలిలో విచారిస్తున్నారు.
సీసీబీ పోలీసుల కంటికి అనుమానాస్పదంగా కనబడినవారిని బార్లలో నుంచి నేరుగా ఆయా పోలీస్‌స్టేషన్లు, లేక సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమాయకులుగా తేలినవారిని వదిలేసి గతంలో ఏమాత్రం నేరచరిత ఉన్నా కౌన్సెలింగ్ ఆరంభిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచే ఇలాంటి దాడులకు సీసీబీ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజాజీనగర, మాగడిరోడ్డు, హనుమంతనగర, పోలీస్‌స్టేషన్లు పరిధిలోని పలుబార్ అండ్ రెస్టారెంట్‌లపై పోలీసులు దాడులకు, కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దొరికినవారిలో 36 మంది రౌడీలు ఉండగా, వారి కార్యకలాపాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు.
రౌడీలు పట్టివేత
హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్లూవిం గ్‌బార్ పై సీసీబీ పోలీసుల దాడిలో అశోక్‌కుమార్, ప్రదీప్, వసంతకుమార్, దేవరాజు, చేతన్‌కుమార్, కాంతరాజు, విజయ్, రాజశేఖర్, విజయ్‌కుమార్ అనే రౌడీలు దొరికారు. రాజాజీనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవరంగ్ బార్ లో సూర్యకుమార్, చంద్రకాంత్, శ్రీకాంత్, మదన్, ఆనంద్, సంజయ్ అనే ఏడుగురుని పట్టుకెళ్లారు. మాగడి కాల్‌టెల్ బార్‌లో మద్యం సేవిస్తున్న నవీన్, మంజునాథ్, భరత్, మహేంద్ర, మంజు, విజయ్‌కుమార్, గోపినాయక్, జగదీశ్, జాకీర్, మహీబ్‌జాన్ అనే 11 మందిని తరలించారు.
ముమ్మరంగా నిఘా చర్యలు
రౌడీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎక్కడెక్కడ గ్యాంగ్‌లు కడుతున్నారు అనే దాని పట్ల సీసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలు, ఖాళీ మైదానాలు, కట్టడాల టెర్రస్‌లపై రౌడీలు చేరుకుని మద్యపానం సేవిస్తూ పార్టీలు చేసుకుంటున్నారని తెలిసి నిఘా పెట్టారు. మునుముందు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఆ పచ్చబొట్లేమిటి?
‘చేతులపై కాకి, గుడ్లగూబ, శునకం ఇలా రకరకాల పచ్చబొట్లు వేసుకుని పోజు కొడితే ఊరుకునేదిలేదు. శుభ్రంగా కటింగ్, షేవింగ్ చేసుకుని మనుషుల్లా కనబడాలి. డాక్టర్ రాజ్‌కుమార్ ట్యాటూ వేసుకుని హత్యలకు పాల్పడతారా’ అని అదనపు పోలీస్‌కమిషనర్ అలోక్‌కుమార్ రౌడీలను హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్బంగా మంగళవారం సీసీబీ కార్యాలయంలో సుమారు 500 మంది రౌడీలకు పరేడ్ నిర్వహించి తీవ్రంగామందలించారు. డిప్రెషన్‌లో ఉన్నాను సార్ అని ఒక రౌడీ చెప్పగా, నిన్ను ఎవరైనా అలా అంటారా? అని ఆగ్రహించారు. మళ్లీ ఏదైనా సెటిల్‌మెంట్‌లకు దిగితే గూండా చట్టం కింద జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైట్‌డ్రెస్ వేసుకుని సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అని మండిపడ్డారు. ఒక్కో రౌడీని ఆయన ప్రశ్నించి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment