
సాక్షి, సిటీబ్యూరో: క్లాస్‌మేట్‌ను ప్రేమ పేరుతో వేధిస్తూ, ఫొటోలు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సిక్ విలేజ్‌కు చెందిన ఓ యువతి, నగరానికి చెందిన మరో యువకుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేశారు. అప్పట్లో వీరిద్దరూ స్నేహపూర్వకంగా మెలిగారు. విద్యాభ్యాసం తర్వాత యువతి సిటీకి తిరిగి వచ్చేయగా.. సదరు యువకుడు అక్కడే ఉద్యోగంలో చేరాడు. గడిచిన కొన్నాళ్లుగా ఆ యువతిని అతను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. ఆమె నిరాకరించడంతో కక్షగట్టిన అతగాడు విచక్షణ కోల్పోయాడు. వివాహం చేసుకుంటే తననే చేసుకోవాలని, లేదంటే అసలు పెళ్లే కాకుండా చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు.
ఆమెపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా ఆమె కుటుంబీకులు, బంధువులు, స్పేహితులకు పంపడం చేస్తుండేవాడు. అతడి వ్యవహారం శ్రుతి మించడంతో బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎన్నారై ఆస్ట్రేలియాలో ఉండడంతో అతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేయాలని నిర్ణయించారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపనున్నారు. తద్వారా అతగాడు ఏ సమయంలో అయినా దేశంలోకి అడుగుపెడితే ఎల్‌ఓసీ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులకు వాంటెడ్ అని గుర్తించే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఆ విషయం సైబర్ క్రైమ్ అధికారులకు తెలపడం ద్వారా అరెస్టు చేసేలా చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment