జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు కేంద్ర బిందువుగా మారిన పీలేరులో గూడులేని నిరుపేదల ఆవాసం కోసం సేకరించిన స్థలంలో రూ. పెద్దలు పాగా వేశారు. రూ.మూడుకోట్ల విలు వైన భూములను దర్జాగా ఆక్రమించేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రెండుసెంట్లు భూమి చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పీలేరు: చాలీచాలనీ కూలితో అద్దె ఇళ్లలో మగ్గుతున్న నిరుపేదల కోసం ఇందిరమ్మ కాలనీ నిర్మించాలని నిర్ణయించిన చిత్తూరు మార్గంలోని కోళ్లఫారం మిట్టన ఉన్న స్థలం పెద్దల చేతిలోకి వెళ్లిపోయింది. కోళ్లఫారం మిట్టన సర్వే నంబర్లు 1076, 1078, 1079/1, 1131/4, 1136, 1137, 1138, 1139, 1140/1, 1144/2, 1145, 1146/4లో 86.35 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించి ప్రభుత్వం 2007లో స్వాధీ నం చేసుకుంది. ఇక్కడ 2,322 ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్ తయారు చేశారు. మొదటి విడతగా 2006–07లో 1,700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కాలనీ నిర్మాణం కోసం అప్పటి పీలేరు ఎమ్మెల్యే, ప్రస్తుతం పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2007 అక్టోబర్ 25వ తేదీన శిలాఫలకం వేశారు. ఒక్కో రెండు సెంట్ల చొప్పున 1,700 ఇళ్లకు 34 ఎకరాలు ఇచ్చారు. 632 పట్టాలకు సంబంధించి సుమారు 12 ఎకరాల స్థలం ఖాళీగా ఉంచారు. కమ్యూనిటీ అవసరాల కోసం 7.80 ఎకరా లు, కాలనీ రోడ్ల నిర్మాణానికి 10 నుంచి 15 ఎకరాలు కేటాయిం చారు. అనంతరం మారిన సమీ కరణల నేపథ్యంలో ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో 3 సెంట్లు చొప్పున సుమారు 600 పట్టాలు అక్రమంగా ఇచ్చి నట్లు ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలం నిబంధనల మేరకు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలి.
రూ.లక్షలు తీసుకుని స్థలాన్ని సంతర్పణ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సర్వే నంబర్ 1136/5లో భారీగా అక్రమాలు జరిగినట్టు సమాచారం. కాలనీ కోసం రైతుల నుంచి సేకరించిన 86.35 ఎకరాల స్థలానికి ఇప్పటివరకు సరిహద్దులు నిర్ధారించకపోవడంతో మూడు కోట్ల విలువ గల సుమారు 10 నుంచి 14 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైంది. సరిహద్దులు నిర్ణయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సర్వేలు, విచారణ పేరిట 2007 నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పటి వరకు రెవెన్యూ అధికా రులు హౌసింగ్ అధికారులకు స్వాధీనం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పీలేరు పట్టణానికి అన్ని వైపులా 5 కిలోమీటర్ల లోపు సుమారు 100 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బీడీ.నారాయణరెడ్డి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేయడం గమనార్హం. కాలనీ స్థలం ఆక్రమణపై భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే రెవెన్యూ అధికారులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం కాలనీలో సర్వే నిర్వహించామని, ఒకటిన్నర ఎకరా ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, ఇందులో గోడౌన్ నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించామని తెలు పుతున్నారు. హౌసింగ్ అధికారులు మాత్రం కాలనీ స్థలం ఇప్పటివరకు రెవెన్యూ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment