ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ మంగారావు
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఒంటరిగి నిద్రిపోతున్న వృద్ధురాలి గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండుగులు దోచుకెళ్లారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన గురువారం తెల్లవారు జామున బీవీ నగర్‌లోని ఉçప్పుకట్లవారి వీధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. బీవీనగర్ రైల్వేగేటు సమీపం ఉప్పుకట్లవారి వీధిలో మహబూబ్‌జానీ (68) నివాసం ఉంటుంది. భర్త అబ్దుల్ రెహమాన్ ఏడాది క్రితం చనిపోవడం, వీరి పిల్లలు రఫి, ఖాజారహంతుల్లా, హనీసా, దిల్షాద్, షంషాద్, నౌషాద్ వేర్వేరుగా ఉండటంతో ఆమె ఒంటరిగానే ఉంటుంది. మహబూబ్‌జానీకి ఉప్పుకట్లవారి వీధిలో ఉన్న మరో మూడు ఇళ్లను అద్దెకు ఇచ్చింది. అయితే కొంత కాలంగా గాంధీనగర్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు రఫి వద్ద ఉంటుంది. నెలకోసారి మహబూబ్‌జానీ బీవీనగర్‌లోని ఇంటికి వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ఇళ్ల అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుండేది.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె అద్దె వసూలు చేసుకుని వస్తానని కుమారుడు రఫికి చెప్పి వచ్చి, కుమార్తె నౌషాద్ ఇంటికి వెళ్లి భోజనం తీసుకుని బీవీనగర్‌కు చేరుకుంది. అక్కడ తన ఇళ్లలో అద్దెకు ఉంటున్న కరిముల్లాతో కొద్దిసేపు మాట్లాడి, కాసేపు తర్వాత ఇంట్లోకి వెళ్లి నిద్రపోయింది. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు పక్కనే ఉన్న మూడు ఇళ్ల తలుపులకు గడియలు బిగించి మహబూబ్‌జానీ ఇంటి తలుపు గడియలను కమ్మితో తొలగించి లోనికి ప్రవేశించారు. నిద్రిస్తున్న ఆమె గొంతు నులిమి హతమార్చారు. ఆమె ఒంటిపై ఉన్న రూ.1.25 లక్షలు విలువ చేసే నాలుగున్నర సవర్లు (బంగారు చైన్, చెవి కమ్మలు, ఉంగరం) ఆభరణాలను దోచుకెళ్లారు. ఉదయం పక్క ఇంట్లో అద్దెకు ఉంటున్న ప్రమీల తన ఇంటి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా అది రాలేదు. బయట గడియ పెట్టిన విషయాన్ని గుర్తించిన ప్రమీల వెనుక కిటికి తెరచి రోడ్డు మీద వెళుతున్న వారిని పిలిచి గడియ తీయమని చెప్పింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని మూడు ఇళ్ల గడియలు తెరిచారు. అనంతరం వృద్ధురాలి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా మహబూబ్‌జానీ మృతి చెంది ఉంది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులకు, ఐదో నగర పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
డాగ్‌స్క్వాడ్ పరిశీలన
వృద్ధురాలి హత్యపై సమాచారం అందుకున్న ఐదో నగర ఇన్‌స్పెక్టర్ జి. మంగారావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా ఆధారాల కోసం గాలించారు. క్లూస్‌టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్ వృద్ధురాలి ఇంటి నుంచి మెయిన్‌రోడ్డు వద్దకు వెళ్లి అక్కడ నుంచి వృద్ధురాలి ఇంటి వెనుక భాగం కొంతదూరం పరిశీలించి తిరిగి వృద్ధురాలి ఇంటి వరకు చేరుకుంది. దీన్ని బట్టి వృద్ధురాలిని హతమార్చి బంగారు దోచుకెళ్లిన దుండగులు స్థానికంగా ఉన్న వారేనని పోలీసులు భావిస్తున్నారు. పక్కా రెక్కీ వేసి వృద్ధురాలు ఒంటరిగా ఉన్న విషయంను గుర్తించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం„ý నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి కుమారుడు షేక్ ఖాజారహంతుల్లా ఫిర్యాదు మేరకు ఐదో నగర ఇన్‌స్పెక్టర్ జి. మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment