పోలీసుల విచారణ
రాజంపేట రూరల్: రాజంపేటలో ఓ వృద్ధురాలి హత్య సంచలనం సృష్టించింది. అందరితో కలివిడిగా ఉండే నర్రెడ్డి సుమిత్రమ్మ(63)ను దుండగులు హతమార్చిన తీరు భయాందోళన రేకెత్తించింది. గతంలో సుజాత అనే మహిళపై అత్యాచారం చేసి హతమార్చి దోపిడీకి పాల్ప డిన దారుణ సంఘటన మరువక ముందే మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది. ఈ కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. ఎర్రబల్లిలో కుమారుడి కుటుంబంతో ఉండే సుమిత్రమ్మకు ధైర్యవంతురాలిగా పేరుంది. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. భర్త వీరనారాయణరెడ్డి చనిపోయాక కుటుంబానికి అన్నీ తానే అయ్యింది. పిల్లలకు చదువులు చెప్పించింది. కుమార్తెకు పెళ్లి చేసింది. కుమార్తె అమెరికాలో ఉంటోంది.. కొడుకు మహీధర్‌రెడ్డి కారు బాడుగపై తిప్పుతుంటాడు. కోడలు పుట్టింటికి వెళ్లడం.. మహీధరరెడ్డి రాజమండ్రి వెళ్లడంతో సుమిత్రమ్మ శుక్రవారం ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈమె ఒంటరిగా ఉండటం తొలిసారి కాదు.
ఆమెకు భయం కూడా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంటికి భద్రంగా తాళాలు వేసుకుని పడుకునేదని ఇరుగుపొరుగువారన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి దుండగులు ఇంట్లో చొరబడి సుమిత్రమ్మను చీర కొంగు మెడకు చుట్టి హత్య చేసి 500 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయల నగదు తీసుకెళ్లిపోయారు. దుండగులు కనీస క్లూ బయటపడకుండా ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసు జాగిలం ఉస్మాన్‌నగర్ వరకూ వెళ్లి వచ్చేసినట్లు తెలిసింది. డీఎస్‌పీ మురళీధర్, రూరల్ సీఐ నరసింహులు, ఎస్‌ఐలు. ఖాజాహుస్సేన్, మహేష్‌నాయుడు, ఏఎస్‌ఐ మల్లిరెడ్డి శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో సీసీ కెమెరాలు అమర్చినా నిర్వహణ విషయంలో పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలున్నాయి.
ఇదే విషయాన్ని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. నిఘా విషయంలో పోలీసులు విఫలం అవడం వలనే ఇలాంటి దురాగతాలకు దొంగలు తెగబడుతున్నారని వారు అంటున్నారు. గతంలో ఇదే తరహాలో సుజాత అనే మహిళ హత్యకు గురైంది. ఐదు నెలలు అవుతున్నా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. కేవలం బంధువులను, చుట్టు పక్కల వారిని విచారించి కేసు వదిలేసినట్లు ఉందని జనం వ్యాఖ్యానిస్తున్నారు. సరైన కోణంలో దర్యాప్తు చేపట్టలేకపోయారనే అపప్రధ ఉంది.
పథకం ప్రకారమే హత్య
ఒక పథకం ప్రకారం మాటువేసి ఒంటరి మహిళలను మట్టు బెట్టుతున్నారని జనం ఆందోళన చెందుతున్నారు. రోజూ తానే జాగ్రత్తగా అన్ని తాళాలు వేసి సుమిత్రమ్మ పడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలిసిన వారు చేశారా లేక దొంగలు రెక్కి నిర్వహించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. సుమిత్రమ్మ బాత్‌రూముకు వెళ్లిన సమయంలో ఇంటిలోకి దుండగలు చొరబడి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇంటిలోపలి భాగంలో బాత్‌రూము లేదు. తలుపులు తీసుకొని వెలుపలికి రావల్సిందే. కాగా ఈమెను అత్యాచారం చేసి హత్యా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. స్థానికంగా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు సత్వరం స్పందించి పట్టణ వాసులకు భద్రత కల్పించాల్సి న అసవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment